Sunday, September 8, 2024

Delhi | ఢిల్లీ చేరిన జూపల్లి, పొంగులేటి.. 26న రాహుల్ గాంధీ​తో భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పెద్దలను కలిసిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పునరుద్ఘాటించారు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి సహా ముఖ్య అనుచరులతో కలిసి ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పొంగులేటికి అప్పటికే ఢిల్లీ చేరుకున్న ఆయన అభిమానులు, అనుచరులు ఘనస్వాగతం పలికారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోగా, పొంగులేటి మాత్రం కాస్త ఆలస్యంగా ఢిల్లీ చేరుకున్నారు. నేతలిద్దరూ సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు.

ఇప్పటికే పలు దఫాలుగా ఏఐసీసీ పెద్దలతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి చెందిన పలువురు నేతలు ఈ నేతలిద్దరితో చర్చలు జరిపారు. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన రాహుల్ గాంధీని నేరుగా కలిసి మాట్లాడిన తర్వాత పార్టీలో చేరిక విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని నేతలిద్దరూ భావించారు. అనుచరుల ఒత్తిడితో నేతలిద్దరి చేరిక దాదాపు ఖరారైనప్పటికీ, తమతో కలిసి నడుస్తున్న ముఖ్య అనుచరులకు టికెట్ల విషయంలో కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి హామీ తీసుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తాను సూచించినవారికే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దల ముందు షరతుగా పెట్టినట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఆట మొదలవుతోంది: పొంగులేటి

తెలంగాణలో ఆట మొదలవుతోందని, తాము ఆ ఆటను పక్కాగా ఆడతామని పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం మధ్యాహ్నం గం. 3.00 సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా మరికొందరు పెద్దలను కలవనున్నట్టు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సహా తెలంగాణకి చెందిన నాలుగైదు జిల్లాల నేతలతో కలిసి కాంగ్రెస్ పెద్దలను కలవనున్నట్టు ఆయన వివరించారు. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ నిర్ణయాన్ని, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారన్నది కాంగ్రెస్ అధిష్టానానికి చెబుతామని అన్నారు. తన చేరిక ఖమ్మంలోనే ఉంటుందని, తన కేడర్ అంతా తనతో పాటే ఉన్నారని పొంగులేటి అన్నారు. భవిష్యత్తులో ఇతర పార్టీల నేతలు, ఇతర ప్రాంతాల నేతలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని అన్నారు.

తన చేరికను వ్యతిరేకిస్తున్న రేణుక చౌదరి సహా నేతలందరినీ కలుస్తానని పొంగులేటి చెప్పారు. భారతీయ జనతా పార్టీలో చేరకుండా కాంగ్రెస్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నామో కూడా మీడియా సమావేశంలో వివరిస్తానని అన్నారు. గత 6 నెలల్లో తాము ఏం చేశామన్నది కూడా మీడియా సమావేశంలో వెల్లడిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతోందని సూత్రీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని పొంగులేటి చెప్పారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసమే రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంలో తన పాత్ర కూడా ఉందని పొంగులేటి గుర్తుచేశారు. అయినప్పటికీ తాను ఏనాడూ పదవులను ఆశించలేదని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా పదవులు ఆశించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement