Sunday, November 24, 2024

Delhi | పంచాయితీ నిధుల దారిమళ్లింపుపై విచారణ జరపండి.. కేంద్రానికి ఏపీ సర్పంచుల సంఘం వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ నిధుల దారిమళ్లింపుపై విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ఏపీ సర్పంచుల అసోసియేషన్, ఏపీ పంచాయితీరాజ్ ఛాంబర్ సంయుక్తంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఏపీ పంచాయితీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షులు వి. లక్ష్మీ ముత్యాల రావు, ప్రధాన కార్యదర్శి పి.రమేశ్ మరికొందరు నేతలతో కలిసి ఢిల్లీలో కేంద్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్‌ను కలిశారు. ఆర్థిక సంఘం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారిమళ్లిస్తోందని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు.

పంచాయితీలకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకపోవగా, కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించి వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయల పంచాయితీ నిధులు పక్కదారి పట్టాయని, దీనిపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. నేతల ఫిర్యాదును పరిశీలించిన కేంద్ర మంత్రి సర్పంచుల సంఘం నేతలను ఆందోళన చెందవద్దని, అన్ని విషయాలు పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

- Advertisement -

కేంద్ర మంత్రితో భేటీ అనంతరం వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. గ్రామ పంచాయితీలకు ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దారిమళ్లించిందని ఆరోపించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను సైతం దారిమళ్లించారని అన్నారు. దాదాపు రూ. 35 వేల కోట్ల ఉపాధి హామీ నిధులను దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని అన్నారు.

అన్ని విషయాలనూ కేంద్ర మంత్రికి వివరించినట్టు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. కమిటీ వేసి విచారణ జరుపుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఆయనన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. సర్పంచుల సంఘం నేతలు తొలుత తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కే. రామ్మోహన్ నాయుడు ఈ బృందాన్ని కేంద్ర మంత్రి వద్దకు తీసుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement