న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో వర్జీనియా పొగాకు ఉత్పత్తి విస్తీర్ణాన్ని 2023–24 పంట సీజనులో 170 మిలియన్ కిలోలకు పెంచాలని వైసీపీ ఎంపీలు కేంద్ర వాణిజ్య శాఖ అడిషనల్ సెక్రటరీ రాకేశ్ అగర్వాల్‌ను అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్‌లో వర్జీనియా పొగాకు ఉత్పత్తి పరిమాణం గతేడాది మాదిరిగానే 142 మిలియన్ కిలోలుగా ఉండాలని ఈ ఏడాది జులైలో జరిగిన సమావేశంలో పొగాకు బోర్డు తీర్మానించిన విషయాన్ని ఎంపీలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
వైసీపీ ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్, మార్గాని భరత్‌లు బుధవారం కేంద్ర సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వర్జీనియా పొగాకు ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని అందులో పేర్కొన్నారు. కాబట్టి ఉత్పత్తి పరిమాణాన్ని పెంచితే పొగాకు రైతులు మరింత రాబడి పొందేందుకు అవకాశముంటుందన్నారు. అలాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని వివరించారు. బోర్డు అధికారులతో చర్చించి పొగాకు పరిమాణాన్ని 170 మిలియన్ కిలోలకు పెంచాలని కోరగా రాకేశ్ అగర్వాల్ సానుకూలంగా స్పందించినట్లు వైసీపీ ఎంపీలు వెల్లడించారు.