Tuesday, November 26, 2024

విప‌క్ష కూట‌మి ‘ఇండియా’కు షాక్ – పేరు వినియోగంపై హైకోర్టు నోటీస్

న్యూ ఢిల్లీ – ప్రతిపక్షాల కూటమికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడంపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈమేరకు ఢిల్లీకి చెందిన గిరీశ్ భరద్వాజ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం కూటమిగా ఏర్పడి, దానికి ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇంక్లూజివ్ అలయెన్స్ ‘ఇండియా’ అని నామకరణం చేశాయి.

అయితే, ఇండియా అనే పేరు జాతీయ చిహ్నంలో భాగమని, చట్ట ప్రకారం వృత్తి, వాణిజ్య, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం కుదరదని ఢిల్లీకి చెందిన గిరీశ్ భరద్వాజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్షాల కూటమి నిర్ణయం సరికాదని, ఒకరకంగా ఇది జాతిని అవమానించడమేనని ఆరోపించారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించినా ఉపయోగం లేకపోవడంతో పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను విచారణకు చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ అమిత్ మహాజన్ నేతృత్వంలోని బెంచ్ తాజాగా 26 అపోజిషన్ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖకు, ఎలక్షన్ కమిషన్ కు కూడా నోటీసులు పంపి వివరణ ఇవ్వాలని ఆదేశించింది

Advertisement

తాజా వార్తలు

Advertisement