Monday, November 18, 2024

Delhi | ఢిల్లీ అర్డినెన్స్ రద్దు చేయాలి.. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ ఎంపీల నిరసన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : లోక్‌సభలో ఆమోదం పొందిన ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని బీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు నేతృత్వంలో బీఆర్‌ఎస్ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు శుక్రవారం నిరసన తెలిపారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. మణిపూర్ అంశంపై చర్చ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిని నిరసించారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు అప్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఫెడరిలిజాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజా ప్రభుత్వాన్ని కాదని, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సమాఖ్య న్పూర్తికి విరుద్ధమని నామ నాగేశ్వరరావు ఆరోపించారు. అందుకే తమ పార్టీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఏమాత్రం ప్రజాస్వామ్య విలువల మీద గౌరవం ఉన్నా వెంటనే ఢిల్లీ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాసరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, బండి పార్ధసారధిరెడ్డి, కె.ఆర్. సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీనకొండ దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement