Tuesday, November 26, 2024

Delhi | కాంగ్రెస్‌కు పదవులు తప్ప ప్రజా సమస్యలు పట్టవు : బడుగుల లింగయ్య

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రజలు వానలు, వరదలతో ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ జీహెచ్‌ఎంసీ ముట్టడికి పిలుపునివ్వడం సరైనది కాదని బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఎంతసేపు సీఎం పదవి నీకా నాకా అనే గొడవే తప్ప ఆ పార్టీకి ప్రజల సమస్యలు పట్టవని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం శుక్రవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు.

టీపీసీసీ పదవిని అడ్డం పెట్టుకుని పిచ్చోడి చేతిలో రాయిలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని లింగయ్య యాదవ్ విమర్శించారు. మణిపూర్‌పై చర్చ చేపట్టాలని ఆందోళన చేస్తున్నా ప్రధాని మాట్లాడకపోవడం బాధాకరమని వాపోయారు. మణిపూర్ ఇంకా రగులుతూనే ఉందన్న లింగయ్య, భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో సోమవారం సభకు వచ్చి ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

తెలంగాణాకి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, విభజన సమస్యలను ఇంతవరకు పరిష్కరించలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌తో తాము కలిసేదే లేదని స్పష్టం చేసిన లింగయ్య యాదవ్ తమ వైఖరి తమకు ఉందని చెప్పుకొచ్చారు. మణిపూర్ మండిపోతుంటే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఇళ్ళ పరిశీలన అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కనీసం వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించడం లేదని దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement