Wednesday, October 23, 2024

Delhi | సొంతగూటికి తిరిగి రండి.. ఏపీలో పాత కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా వేర్వేరు పార్టీల్లోకి వెళ్లిపోయిన కాంగ్రెస్ నేతలను సొంతగూటికి తిరిగిరావాల్సిందిగా ఆ పార్టీ ఆహ్వానం పలుకుతోంది. బుధవారం ఢిల్లీలోని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే క్రమంలో వివిధ రాష్ట్రాల ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న ఏఐసీసీ పెద్దలు బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యనేతలతో సమావేశాన్ని నిర్వహించింది.

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా మరికొందరు ఏఐసీసీ పెద్దలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు‌, కేంద్ర మాజీ మంత్రులు ఎం.ఎం. పల్లంరాజు, జేడీ శీలం, డా. చింతా మోహన్, కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగోర్, ఏఐసీసీ ముఖ్య నేత కొప్పుల రాజు, కాంగ్రెస్ వర్కింట్ కమిటీ సభ్యులు రఘువీరా రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఉషా నాయుడు, మాజీ ఎంపీలు కనుమూరి బాపిరాజు, హర్షకుమార్, సుంకర పద్మశ్రీ, తులసి రెడ్డి, మస్తాన్‌వలీ, మధు యాదవ్, గౌతమ్, కిసాన్ సెల్ అధ్యక్షులు గుర్నాథ రావు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీలో పార్టీని లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన కార్యాచరణ, యాక్షన్ ప్లాన్, ప్రకటించాల్సిన గ్యారంటీలు, మేనిఫెస్టో, రానున్న 100 రోజుల్లో నిర్వహించాల్సిన ప్రచార కార్యక్రమాల గురించి విస్తృతంగా చర్చించారు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఏడాది కాలంలో అమలు చేసిన కార్యక్రమాలపై 700 పేజీల యాక్టివిటీ రిపోర్టును గిడుగు రుద్రరాజు అధిష్టానానికి అందజేశారు. జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. హిందూపురంలో సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను, విశాఖలో తలపెట్టిన సభకు రాహుల్ గాంధీని, అమరావతిలో నిర్వహించదలచిన సభకు ప్రియాంక గాంధీని రాష్ట్ర నాయకత్వం ఆహ్వానించింది. వీటన్నింటితో పాటు జాతీయస్థాయిలో ఏర్పాటైన విపక్ష కూటమి (I.N.D.I.A)లో భాగంగా ఉన్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఐ (ఎం)తో పొత్తుల అంశం గురించి కూడా సమావేశంలో చర్చ జరిగింది.

- Advertisement -

ఇదే సమావేశంలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేరిక గురించి కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు గుర్నాథరావు ప్రస్తావించారు. షర్మిల చేరికపై రాహుల్ గాంధీ రాష్ట్ర నేతల అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా కోరారు. ఒకరిద్దరు నేతలు మినహా మిగతా నేతలందరూ తమ చేతులు పైకెత్తి షర్మిల చేరికను స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు. షర్మిల చేరికతో పార్టీ బలోపేతమవుతుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన డా. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అంతటా మంచి పేరు ఉందని, ఆయన కుమార్తె షర్మిల చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని మాజీ మంత్రి ఎం.ఎం. పల్లంరాజు తెలిపారు. మరికొందరు నేతలు కూడా షర్మిల చేరికపై తమ సానుకూలత వ్యక్తం చేస్తూ అభిప్రాయాలు వెల్లడించినట్టు తెలిసింది.

కొత్త పొత్తలపై చర్చించలేదు – మాణిక్కం టాగోర్
—————
సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన మాణిక్కం టాగోర్ తొలుత మీడియాతో మాట్లాడారు. విపక్ష కూటమి (I.N.D.I.A)లో భాగంగా ఉన్న పార్టీలతో తప్ప కొత్త పొత్తుల గురించి ఈ సమావేశంలో చర్చించలేదని, సీట్ల సర్దుబాటు గురించి అసలు చర్చే జరగలేదని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు అనుసరించాల్సిన ప్రణాళిక, వ్యూహాలపై చర్చించినట్టు తెలిపారు. మోడీ సర్కారు వివక్షాపూరిత వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి న్యాయం చేయగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిపోయిన నేతలతో పాటు భావసారూప్యత కల్గిన ఇతర నేతలు ఎవరైనా సరే తమ పార్టీలో చేరవచ్చని టాగోర్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల చేరిక గురించి ప్రశ్నించగా.. ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించారని, ఆమె చేరికపై ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. షర్మిల సహా కాంగ్రెస్‌తో కలిసొచ్చే పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నట్టు మాణిక్కం టాగోర్ ప్రకటించారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పరాజయం పాలైనప్పటికీ.. ఈసారి పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని అన్నారు. పార్టీని బలోపేతం చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నామని అన్నారు. కర్ణాటకలో గెలుపు ప్రభావం తెలంగాణ విజయానికి దోహదం చేసిందని, అలాగే ఇప్పుడు తెలంగాణ విజయం ఏపీలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని అన్నారు.

ఏపీలో నిశ్శబ్ద విప్లవం
అద్భుతాలు జరగబోతున్నాయి – గిడుగు రుద్రరాజు
———————
కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం జరిగిన స్ట్రాటజీ సమావేశం అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నిశ్శబ్ద విప్లవం జరుగుతోందని, రాష్ట్ర విభజన తర్వాత పాలించిన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలపై ప్రజలు విసుగు చెందారని రుద్రరాజు అన్నారు. ఈ క్రమంలో ప్రజలు మరో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని, రాష్ట్రంలో అద్భుతాలు జరగబోతున్నాయని తెలిపారు. రానున్న 100 రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఎలా పనిచేయాలన్న అంశంపై చర్చించామని, కూటమి భాగస్వామ్య పార్టీలతో సమన్వయం చేసుకోవడంపై అధిష్టానం దిశానిర్దేశం చేసిందని వెల్లడించారు. భావసారూప్యత కల్గిన పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలిసి పనిచేసేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని అన్నారు. కర్ణాటకలో గెలుపు ప్రభావం తెలంగాణలో ఎలాగైతే ఉపయోగపడిందో, తెలంగాణ గెలుపు ప్రభావం ఏపీపై కూడా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ భావజాలంతో పనిచేసి వివిధ పార్టీల్లోకి వెళ్లిన అందరినీ వెనక్కి తిరిగిరావాలని పిలుపునిచ్చారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ కారణంగా అభివృద్ధి, సంక్షేమం జరిగిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టం వంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు కాంగ్రెస్ హయాంలోనే తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ నిర్ణయాల లబ్దిదారులందరూ తిరిగి కాంగ్రెస్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరా సాగర్ పేరుతో పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని, ఇందిరాగాంధీ ఫౌండేషన్ వేసి ప్రారంభించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ఆలోచనలో బీజేపీ ఉందని గుర్తుచేశారు. కర్ణాటక, తెలంగాణలో ఇచ్చిన గ్యారంటీలను ఉదహరిస్తూ ప్రచార కార్యక్రమాలు ఉంటాయని, ఏపీలో ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు జాతీయ నేతలు వస్తారని తెలిపారు. అలాగే కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా ఏపీలో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు. మేనిఫెస్టో – గ్యారంటీలపై జాతీయ స్థాయిలో చిదంబరం నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ పనిచేస్తోందని, ఆ కమిటీ అధ్యయనం చేసి రూపొందించిన మేనిఫెస్టో ఆధారంగా తాము రాష్ట్రానికి ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తామని అన్నారు. గతంలో 1999లో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ ఉచిత విద్యుత్తు సహా అనేక అంశాలు పొందుపరిచిందని ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు గుర్తుచేశారు. విశాఖలో 25 వేల ఎకరాల భూములు కలిగిన స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ప్రయత్నంలో బీజేపీ ఉందని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర రాజధాని, ప్రత్యేక హోదా వంటివి కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే సాధ్యపడతాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ఇదివరకే చెప్పారని గుర్తుచేశారు.

షర్మిల చేరిక ఇక లాంఛనమే!
———————
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన వైఎస్ షర్మిల, తన పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ఇక లాంఛనమేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విలీనం అనంతరం ఆమెకు అప్పగించాల్సిన బాధ్యతలు, తదుపరి కార్యాచరణపై ప్రస్తుతం చర్చలు, మంతనాలు జరుగుతున్నాయని సమాచారం. షర్మిల గతంలోనే కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం వ్యతిరేకించడంతో అప్పుడు అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షర్మిల సేవలను కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అప్పట్లో తాను తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతానని వైఎస్ షర్మిల తెలిపారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆమె సేవలను దేశవ్యాప్తంగా ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ వినియోగించుకోవాలని చూస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా షర్మిల ఒక అస్త్రంగా ఉపయోపడవచ్చని అంచనా వేస్తోంది. షర్మిల సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, కుటుంబంలో ఏర్పడ్డ విబేధాల ప్రభావంతో ప్రభుత్వ వ్యతిరేకతను, వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అనుకూలతను ఉపయోగించుకోడానికి షర్మిల కీలక సాధనంగా మారవచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే బుధవారం నాటి సమావేశంలో రాష్ట్ర నాయకత్వం అభిప్రాయం కోరింది. ఒకరిద్దరు మినహా మిగతా అందరూ సానుకూలత వ్యక్తం చేయడంతో ఇక అధిష్టానం నిర్ణయం తీసుకోవడమే మిగిలి ఉంది.

వైఎస్సార్టీపీ విలీనం సందర్భంగా షర్మిల తాను ఏపీలో ప్రచారానికి సిద్ధమేనని అంగీకరించినట్టు తెలిసింది. అయితే తెలంగాణ నుంచే లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతానని, ఖమ్మం లేదా నల్గొండ పార్లమెంట్ టికెట్ తనకు కేటాయించాలని కోరుతున్నారని తెలిసింది. ఈ చర్చల ప్రక్రియలో షర్మిల భర్త – బ్రదర్ అనిల్ మరికొందరితో కలిసి ఢిల్లీలో ఉండి మంతనాలు సాగిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిన వెంటనే ఆమె ఢిల్లీ వచ్చి విలీన ప్రక్రియను పూర్తిచేయనున్నట్టు తెలిసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement