Friday, November 22, 2024

Delhi: ముగిసిన బెయిల్ గ‌డువు.. మ‌ళ్లీ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌పై వచ్చిన ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు తీహార్ జైలులో లొంగిపోతున్నారు. అతని ఇంటి నుంచి బయలుదేరిని కేజ్రీవాల్, రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత హనుమాన్ మందిర్‌ని దర్శించారు. ఆ తర్వాత పార్టీ ఆఫీస్‌కి వెళ్లి నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడిన కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

”21 రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోలేదు.. అన్ని పార్టీలకు ప్రచారం చేశాను.. దేశాన్ని కాపాడేందుకే ప్రచారం చేశాను.. దేశం ముఖ్యం ఆ తర్వాతే ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇది మరచిపోలేని అనుభూతి” అని కేజ్రీవాల్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదని ఒప్పుకున్నారని, ఇది ఈ ప్రచారంలో గొప్పతనం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది, అఖండ మెజారిటీతో గెలిచిన ముఖ్యమంత్రిని సాక్ష్యాలు లేకుండా ఎలా జైల్లో పెడతారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ని జైల్లో పెట్టగలిగినప్పుడు, దేశంలో ఎవరినైనా జైల్లో పెడతారని, ఇది నియంతృత్వమని ఆయన విమర్శించారు.

లొంగిపోయే ముందు అరవింద్ కేజ్రీవాల్ వెంట ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, ఢిల్లీ మంత్రులు అతిషి, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, రాజ్యసభ ఎంపీలు సంజయ్ సింగ్, సందీప్ పాఠక్, నేతలు దుర్గేష్ పాఠక్, రాఖీ బిర్లా, రీనా గుప్తాలతో సహా పార్టీ నేతలు ఉన్నారు. అనారోగ్య కారణాలతో తాను జైలుకు వెళ్తున్నానని, ఎలాంటి చికిత్స అందుతుందో తెలియద‌ని కేజ్రీవాల్ అన్నారు. నన్ను ఏం చేస్తారో తెలియదని, మేం భగత్ సింగ్ శిష్యులం, దేశాన్ని రక్షించేందుకు జైలుకు వెళ్తున్నాం, అధికారం నియంతృత్వంగా మారినప్పుడు జైలు బాధ్యతగా మారుతుందని ఆయన అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement