న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారీ వర్షాలు, వరదలు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలను అతలాకుతలం చేశాయని ఆలిండియా కిసాన్ సభ ఆరోపించింది. బుధవారం ఢిల్లీలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు హన్నన్ మొల్లా మాట్లాడుతూ.. వర్షాలు, వరదల కారణంగా రోడ్లు, ఇళ్లు, పంట పొలాలు కొట్టుకుపోయాయని, తాగునీటి సమస్య కూడా ఏర్పడిందని అన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన పంట నష్టం గురించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు లేఖ రాసినట్టు తెలిపారు. 10 లక్షలకు పైగా ఎకరాల్లో భారీగా పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్.. వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు భారీగా నష్టపోయాయని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 3 కోట్ల టన్నుల వరిని ఉత్పత్తి చేస్తున్నామని, అలాంటి రాష్ట్రాలు వరదలో చిక్కుకుంటే కేంద్రం కనీసం స్పందించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అంటే గుజరాత్ ప్రభుత్వమా అని ప్రశ్నించారు. జిఎస్టీ పేరుతో లక్షల కోట్లు తీసుకుంటూ రాష్ట్రానికి కష్టం వచ్చినపుడు నిధులు ఇవ్వరా అని నిలదీశారు. వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, ముఖ్యంగా పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు. జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి, పీఎం కేర్ నిధి నుంచి తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. వరదలు సంభవించిన రాష్ట్రాల్లో పర్యటించి నష్టంపై అంచనా వేయాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దృష్టి అంతా పార్టీలో చేరికలపైనే ఉంది తప్ప రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టడం లేదని నిందించారు.