న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా)’లో భాగమేనని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం పార్లమెంటు ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట విపక్ష కూటమి నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ప్లకార్డులు పట్టుకుని నిలబడ్డ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ ఫొటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
తాము మొదటి నుంచి చెబుతున్నట్టు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే నాణేనికి చెరో ముఖం అని, విపక్ష కూటమి ‘ఇండియా’లో బీఆర్ఎస్ భాగమని ఆరోపించారు. తెలంగాణలో కేవలం ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పుకోవడం కోసం మాత్రమే బీఆర్ఎస్పై పోరాడుతున్నట్టు కనిపిస్తుందని, కానీ పార్లమెంటులో కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతుంటాయని వెల్లడించారు. అనంతరం మధ్యాహ్నం పార్లమెంట్ గేటు బయట మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ఛత్రఛాయల్లో బీఆర్ఎస్ ఎంపీలు తిరుగుతున్నారని డా. లక్ష్మణ్ ఆరోపించారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తున్న ప్రతిపక్షం గురించి మాట్లాడుతూ.. జనం తమ పక్షాన ఉన్నారని, విపక్షాలు ఎన్ని అవిశ్వాస తీర్మానాలు పెట్టినా తమకొచ్చే నష్టం లేదని లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. ఇండియా పేరుతో ఏర్పడ్డ విపక్ష కూటమి ఎంతో కాలం ఉండదని అన్నారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా సభలోనే ఈ విషయం చెప్పారని ఆయనన్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా సరే చర్చించేందుకు ప్రతిపక్షాలు సహకరించడం లేదని, చర్చ నుంచి పారిపోతున్నది ప్రతిపక్షాలేనని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా అందుకోలేకపోయిన కాంగ్రెస్, భవిష్యత్తులోనూ మళ్లీ మళ్లీ అదే స్థితిని ఎదుర్కొంటుందని అన్నారు.