Monday, November 18, 2024

Delhi | అమిత్ షాను కలిసిన బండి సంజయ్.. తెలంగాణ వ్యవహారాలపై చర్చించినట్టు ట్వీట్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ అధ్యక్ష మార్పు తర్వాత తొలిసారిగా రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. సోమవారం పార్లమెంట్ భవనంలోని కేంద్ర హోంమంత్రి ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాజకీయాంశాల గురించి చర్చించినట్టు సమావేశం అనంతరం అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ నెల 29న అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్న సందర్భంగా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

అమిత్ షా జులై 28న తమిళనాడులోని రామేశ్వరం చేరుకుని బీజేపీ పరివర్తన్ యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. అక్కణ్ణుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఖమ్మంలో సభ ఏర్పాటు చేయాల్సినప్పటికీ, కొన్ని కారణాల రీత్యా తన పర్యటనను హైదరాబాద్‌ కు మాత్రమే పరిమితం చేస్తారని, పార్టీలో తాజా పరిస్థితుల గురించి సమీక్ష జరపనున్నట్టు వెల్లడించాయి.

- Advertisement -

ఎన్నికలకు కొద్ది నెలల ముందు రాష్ట్ర అధ్యక్ష మార్పు నిర్ణయం కారణంగా పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవడేకర్ సహా తెలంగాణలో పర్యటించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా అధిష్టానానికి నివేదికలు అందించినట్టు తెలిసింది. పార్టీ కార్యకర్తలు, శ్రేణుల నుంచి వస్తున్న స్పందనను పరిగణలోకి తీసుకున్న అధినాయకత్వం అమిత్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా లోతుగా సమీక్షించి తదుపరి కార్యాచరణను తెలియజేయనున్నట్టు తెలిసింది.

నారాయణ స్వామితో భేటీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనడంతో పాటు అమిత్ షా కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఢిల్లీలో ఉన్న బండి సంజయ్, సోమవారం సాయంత్రం కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి ఎ. నారాయణ స్వామిని కలిశారు. తన నియోజకవర్గం పరిధిలో దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేసే అంశంపై ఆయనతో చర్చించినట్టు తెలిసింది. మంగళవారం హైదరాబాద్‌లో తలపెట్టిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ వెళ్లనున్నట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement