Monday, November 25, 2024

Delhi | విపక్ష కూటమికి విరుగుడు వ్యూహం.. పోటీ చేసే ప్రతిచోటా 50% ఓట్లు లక్ష్యం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓటమే తమ ఏకైక లక్ష్యంగా జట్టుకట్టిన విపక్ష కూటమి (I.N.D.I.A) వ్యూహాలపై కమలనాథులు ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల అర్థగణాంకాల్లో రాజకీయ పార్టీల పొత్తులు గెలుపోటములను నిర్దేశిస్తాయి. ఈ పొత్తులను సైతం చిత్తు చేయాలంటే 50% ఓట్లను మించి కైవసం చేసుకోవాలి. అప్పుడు ప్రత్యర్థుల ఓట్లన్నీ కలిసినా ఓడించడం అసాధ్యం. ఇప్పుడు బీజేపీ ఇదే సూత్రాన్ని అనుసరించి తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తాము పోటీ చేసిన ప్రతి చోటా 50% ఓట్లను టార్గెట్ చేస్తోంది.

తద్వారా కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన విపక్ష కూటమి నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని నివారించాలని చూస్తోంది. ఇదేమీ ఆ పార్టీకి కష్టసాధ్యమైన లక్ష్యం కాదు. గత సార్వత్రిక ఎన్నికల్లోనే బీజేపీ పోటీ చేసిన 436 స్థానాల్లో 303 గెలుచుకుంది. ఇందులో 50% మించి ఓట్లు సాధించి గెలిచినవి 224 ఉన్నాయి. అంటే గత ఎన్నికల్లోనే విపక్షాలన్నీ ఇప్పటి మాదిరిగా జట్టుకట్టి ఉంటే బీజేపీకి 79 స్థానాల్లో నష్టం కలిగించగలిగేది.

అయితే ఇప్పుడు ఎలాగైనా సరే వరసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న కమలదళాన్ని నిలువరించాలని చూస్తున్న విపక్ష కూటమి 400కు పైగా స్థానాల్లో బీజేపీపై ‘ఉమ్మడి అభ్యర్థి’ని బరిలోకి దించాలని చూస్తోంది. తద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి, ఆ పార్టీ లాభపడకుండా చూడాలని, వ్యతిరేక ఓట్లను తమ ఉమ్మడి ఖాతాలో వేసుకోవడం ద్వారా తాము గెలుపొందవచ్చని భావిస్తోంది. పదేళ్లుగా అధికారంలో ఉన్నందున సహజంగా ప్రభుత్వంపై ఏర్పడే వ్యతిరేకత కూడా తమకు కలిసొస్తుందని లెక్కలు వేసుకుంటోంది.

- Advertisement -

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం (అధిక ధరలు) వంటి పరిస్థితులు సైతం తమకు అనుకూలంగా మారతాయని భావిస్తోంది. విపక్ష ‘ఉమ్మడి అభ్యర్థి’ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ తమ అస్త్రాలకు పదును పెడుతోంది. గతంలోనే 224 స్థానాల్లో 50 శాతం మించి ఓట్లతో గెలుపొందిన చరిత్ర ఉంది కాబట్టి… ఈ సారి 50% మించి ఓట్లతో గెలుపొందే స్థానాల సంఖ్యను కనీసం 300కు పెంచుకోవాలి. మొత్తంగా 400కు పైగా స్థానాల్లో గెలుపొందేందుకు నేతలు, కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలి. ఇవే తమ చివరి ఎన్నికలుగా, జీవన్మరణ పోరాటంగా భావించాలి.

అప్పుడే విపక్ష కూటమి ఎత్తులను చిత్తు చేయవచ్చు అని కమలనాథులు భావిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ, రాష్ట్రాల పదాధికారుల సమావేశంలో ఇదే విషయాన్ని నూరిపోశారు. ఇక నుంచి నేతలు, కార్యకర్తలు.. ప్రతి ఒక్కరూ అనునిత్యం ప్రజల్లోనే ఉండాలని, ప్రజలతోనే మమేకమై కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. మరోవైపు యువమోర్చా ఈ ప్రక్రియలో కీలకంగా మారాలని సూచిస్తూ.. అయోధ్య రామమందిరం గురించి దేశవ్యాప్తంగా 5,000కు పైగా సభలు, కార్యక్రమాలు చేపట్టాలని, కనీసం 10 కోట్ల కుటుంబాలను చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు.

ఇక కనీసం 50% ఓట్లను సాధించాలంటే.. ముందు 2019లో తమకు ఓటేసిన ఓటర్లను చేజారకుండా చూసుకోవడంతో పాటు కొత్త ఓటర్లను కూడా ఆకట్టుకోవాలి. ఆ దిశగా సామాజిక సమీకరణాలకు సైతం పెద్దపీట వేస్తూ మధ్యభారత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చింది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న యాదవులను ఆకట్టుకోవడం కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌ను ఎంపిక చేసింది. యూపీలో సమాజ్‌వాదీ, బిహార్‌లో ఆర్జేడీ వంటి పార్టీలను యాదవులు తమ సొంత పార్టీలుగా భావిస్తారు.

మిగతా ఓబీసీ సమాజం మొత్తం ఒకవైపు నిలిచినా సరే వారు మాత్రం ఈ రెండు పార్టీలను వీడి బయటకు రాలేదు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ వరుసగా విజయం సాధించడం వెనుక ఓబీసీ ఓట్లు కీలక పాత్ర పోషించాయి. కానీ ఓబీసీ సమాజంలో అంతర్భాగంగా యాదవులను మాత్రం బీజేపీ ఇంతకాలం పాటు ఆకట్టుకోలేకపోయింది. ఈసారి యాదవ సమాజంలో ఎంతో కొంత మందిని తమవైపు తిప్పుకుంటే ఆ ఓట్లు అదనంగా చేరినట్టేనని భావిస్తోంది. మరోవైపు దళిత, గిరిజన-ఆదివాసీలను కూడా ఇంతకాలం పాటు కాంగ్రెస్ లేదా ఇతర ప్రాంతీయ పార్టీల ఓటుబ్యాంకుగా పరిగణించే పరిస్థితి ఉండేది.

కానీ బీజేపీ గత పదేళ్లలో ఈ రెండు సామాజికవర్గాల్లోనూ చాలావరకు చొచ్చుకెళ్లింది. ఓసారి దళిత రాష్ట్రపతి, మరోసారి గిరిజన-ఆదివాసీ మహిళా రాష్ట్రపతి వంటి సామాజిక సమీకరణాలను కూడా అమలు చేసింది. తమ ఓటుబ్యాంకు కాదు అనుకుని ఏ వర్గాన్నీ వదిలిపెట్టకుండా చివరకు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ముస్లింలకు సైతం దగ్గరయ్యే ప్రయత్నాలు చేపట్టింది.

వీటికి తోడు దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలను ఆకట్టుకునేందుకు ఈమధ్య పాస్ చేసిన మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆయుధంగా మలచుకోవాలని చూస్తోంది. అలాగే 140 కోట్ల భారతీయుల్లో 70 కోట్లకు పైగా ఉన్న వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్నాయి. కావాల్సిందల్లా తమ ఓటర్లను పోలింగ్ రోజున విధిగా ఓటేసేలా ప్రోత్సహించడం, వీలుంటే వారిని దగ్గరుండి పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఓటేయించడమే. బీజేపీ అధినాయకత్వం కార్యకర్తలకు ఇదే పనిని ఒక యజ్ఞంలా, ఒక తపస్సులా చేపట్టాలని సూచించింది.

పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు సైతం పెద్ద పదవులు లభిస్తాయనడానికి ఉదాహరణగా మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్‌లాల్ శర్మ వంటి నేతలను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. సామాన్య కార్యకర్తలు ఉన్నత పీఠంపై కూర్చోగలిగే పరిస్థితి ఏ ప్రాంతీయ పార్టీలోనూ కనిపించదు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలోనూ రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయిన పాతతరం నాయకత్వానికే అవకాశాలు కొనసాగుతున్నాయి తప్ప కొత్త తరానికి అవకాశం కల్పించలేని స్థితి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం దీనికి మినహాయింపుగా ఉన్నప్పటికీ.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో యువ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్లకు అవకాశాలు లభించలేదు.

వారిలో సింధియా కమలదళంలో చేరిపోగా.. సచిన్ పైలట్ అసంతృప్తితో కొనసాగుతున్నారు. ఏ పార్టీలోనైతే కార్యకర్తలు, నాయకత్వం తమకు కూడా అవకాశాలు లభిస్తాయన్న నమ్మకంతో ఉంటారో అక్కడ రెట్టించిన ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉంటుంది. పార్టీ గెలుపే తమ గెలుపుగా భావిస్తూ అహర్నిశలు శ్రమించే పరిస్థితి ఉంటుంది. బీజేపీ ఆ రకంగా సొంత పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ.. కదోనోత్సాహంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement