న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ రాజధానిలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. బుధవారం ఉదయం ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్, స్పెషల్ కమిషనర్ ఎన్.వి.రమణారెడ్డి, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ జెండా ఎగురవేసి కార్యక్రమాలను ప్రారంభించారు.
రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భవన్ ప్రాంగణంలో ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ క్యాంప్‌కు అనేక మంది తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఢిల్లీలోని ప్రముఖ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం నాదస్వరంతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
నాట్య గురువులు కేజే మోహన్‌రావు, పీవీ జానకి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కరతాళ ధ్వనులతో కళాకారులకు అభినందనలు తెలిపారు. అవతరణ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి కమిషనర్ల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. అవతరణ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భవన్‌ను విద్యుద్దీపాలతో అలంకరించారు.