Friday, November 22, 2024

Delhi: ట్రాన్సిట్ హబ్‌గా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్.. ప్రారంభానికి రెడీగా ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్ ఏరియా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనతను సాధించేందుకు ముస్తాబవుతోంది. భవిష్యత్తు అవసరాలను సైతం దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఇంటర్నేషనల్ టూ ఇంటర్నే,నల్ ట్రాన్స్‌ఫర్ ఏరియా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సదుపాయాలతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-3(ఏ)లో భాగంగా చేపట్టిన టెర్మినల్-3 వద్ద అప్పటికే ఉన్న ఇంటర్నేషనల్ టూ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్ ఏరియాకు రెండింతల వైశాల్యంలో మొత్తం 3,000 చ.మీ విస్తీర్ణంలో నిర్మించారు.

తద్వారా ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సామర్థ్యం ఏడాదికి 100 మిలియన్లు (10 కోట్లు) చేరుకుంటుందని జీఎంఆర్ సంస్థ వెల్లడించింది. ఇందులో మొత్తం 7 ఫుడ్ అండ్ బేవరేజెస్ రిటెయిల్ కౌంటర్లు, 10 చెకిన్ కౌంటర్లు, 15 ఫ్రిస్కింగ్ బూత్‌లు, 8 ఎక్స్-రే మెషీన్లను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులు షాపింగ్ చేయడం, నచ్చిన ఆహార పదార్థాలను భుజించడంతో పాటు తదుపరి విమానానికి సమయం ఉంటే విశ్రాంతి తీసుకునే సదుపాయాలు కూడా కల్పించారు. టెర్మినల్-3లో పెరిగిన అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ విస్తరణ చేపట్టినట్టు జీఎంఆర్ సంస్థ ప్రకటించింది. పెరిగిన మౌలికవసతులతో విమానాశ్రయం సామర్థ్యం కూడా పెరిగిందని జీఎంఆర్ గ్రూప్ డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్ ఐ. ప్రభాకర్ రావు అన్నారు. ఫేజ్ 3(ఏ)లో భాగంగా టీ-1 యాప్రాన్, 4వ రన్ వే, నార్తర్న్- సదరన్ ఎయిర్‌ఫీల్డులను అనుసంధానించే డ్యుయల్ ఎలివేటెడ్ ఈస్టర్న్ క్రాస్ ట్యాక్సీవేలను నిర్మించినట్టు ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement