Tuesday, November 19, 2024

సెకండ్ వేవ్ కంటే థర్డ్ వేవ్ దారుణంగా ఉంటుంది: ఎయిమ్స్ చీఫ్

క‌రోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ ప్రజలు ఎంతగా వణికిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్స్ లేక‌, ఆక్సిజ‌న్ అంద‌క‌ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆస్పత్రుల బిల్లులు కోసం కొంతమంది ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అటు స్మశానాల్లో అయితే క‌రోనా మృత‌దేహాల‌ను ఖ‌న‌నం చేసేందుకు కూడా క్యూలైన్లు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డా.ర‌ణ‌దీప్ గులేరియా కరోనా థర్డ్ వేవ్‌పై పలు విషయాలను వెల్లడించారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌స్తే సెకండ్ వేవ్‌ను మించి ఉంటుందన్నారు. దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ముగుస్తున్నందున ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నార‌ని… కానీ ఆంక్ష‌ల స‌డ‌లింపులో ఏమాత్రం తేడా వ‌చ్చినా కేసులు పెరుగుతాయ‌న్నారు. ఇప్ప‌టికే ఈశాన్య రాష్ట్రాలు, కేర‌ళ‌లో కేసులు పెరుగుతున్నాయ‌ని, ఆంక్ష‌లు స‌డ‌లించ‌టం ద్వారా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ కేసులు పెరిగే ప్ర‌మాదం ఉంద‌న్నారు. అదే జ‌రిగితే థ‌ర్డ్ వేవ్ భ‌యంక‌రంగా ఉంటుంద‌ని డా.రణదీప్ గులేరియా హెచ్చ‌రించారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ప‌నిచేస్తున్నాయ‌ని వివరించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుంటే మరణాల శాతాన్ని తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. అందుకే థ‌ర్డ్ వేవ్ రాక‌ముందే ప్రజలందరూ టీకాలు తీసుకోవ‌టం మంచిద‌ని ఆయన సూచించారు.

ఈ వార్త కూడా చదవండి: దేశంలో భారీగా తగ్గిన కరోనా మరణాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement