న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అండర్‌పాస్‌లు, బ్రిడ్జిల వద్ద నీటి నిల్వ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్టు కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే దాదాపు వెయ్యి అండర్‌పాస్‌లకు మరమ్మత్తులు చేపడుతున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వర్షాకాలంలో రైల్వే అండర్‌పాస్/బ్రిడ్జిల వద్ద నీరు నిలవకుండా తీసుకుంటున్న చర్యలేంటి? ఈ సమస్యను అధిగమించడానికి చేపడుతున్న నిర్మాణాలేంటో తెలపాలంటూ వైఎస్సార్సీపీ లోక్‌సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి గురువారం సమాధానమిచ్చారు.
అండర్‌పాస్/బ్రిడ్జిల నిర్మాణంలోని స్లాబ్‌ల మధ్య ఉండే జాయింట్లను ప్రత్యేక డిజైనింగ్ ద్వారా సాంకేతికతను ఉపయోగించి ఈ జాయింట్లను కలుపుతున్నట్లు వివరించారు. అండర్‌పాస్‌లలో ఉండే రిటైనింగ్ వాల్స్‌లో ఏర్పడే రంధ్రాల ద్వారా కూడా నీరు వస్తుందని, వీటిని మూసివేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ అన్నారు. అండర్‌పాస్‌ల వద్ద అప్రోచ్ రోడ్లపై షెడ్లు నిర్మిస్తున్నామని, నీరు రాకుండా కాంక్రీట్‌తో గార్డులా గోడల నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని అండర్‌పాస్‌లలో నీటిని బయటకు పంపేందుకు పంపులు, క్రాస్ డ్రైనేజీలను నిర్మిస్తున్నట్లు ఆయన జవాబులో పేర్కొన్నారు.