న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ కోరుకున్నట్టే స్వయంపాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ, సకల జనుల అభ్యున్నతిని సాధిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ కలను సాకారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఆదివారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో అంబేద్కర్ ఆడిటోరియంలో రెసిడెండ్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన జరిగిన జయశంకర్ జయంతి వేడుకలకు బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా. ఆయాచితం శ్రీధర్, వివిధ జిల్లాల గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్లు అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి నివాలళుర్పించారు. జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించి, మొక్కవోని దీక్షతో సాహసోపేత పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని ఎంపీ లింగయ్య గుర్తు చేశారు. అనంతరం ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ ప్రొఫెసర్గా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంతకర్తగా జయశంకర్ ప్రజల్లో చెరగని ముద్ర వేశారనిపేర్కొన్నారు.