న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 56 ప్రాజెక్ట్‌లకు సంబంధించి అంచనా వ్యయం 52.36 శాతం, అంటే అదనంగా 53 వేల కోట్ల రూపాయలు పెరిగిందని గణాంకాలు, కేంద్ర కార్యక్రమాల అమలు శాఖ సహాయ మంత్రి రావ్ ఇందర్‌జిత్ సింగ్ వెల్లడించారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌లు నిర్ణీత గడువులోగా పూర్తి కానందున ఆయా ప్రాజెక్ట్‌ల వాస్తవ అంచనా వ్యయం 40 శాతం పెరిగిన విషయం వాస్తవమేనా? వాస్తవమైతే ఆయా ప్రాజెక్ట్‌ల వివరాలు, పెరిగిన వాటి అంచనా వ్యయం మొత్తం ఎంతో తెలియచేయండి అంటూ రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ప్రాజెక్ట్‌లను అమలు చేసే కేంద్ర సంస్థలు ఆన్‌లైన్ కంప్యూటరైజ్డ్ మానిటరింగ్ వ్యవస్థ (ఓసిఎంఎస్)లో ఆయా ప్రాజెక్ట్‌ల నిర్మాణ పురోగతిని తెలిపే వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటాయని మంత్రి చెప్పారు.
2023 ఫిబ్రవరి నాటికి అందిన ఫ్లాష్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1,01,272 కోట్ల రూపాయల వాస్తవ అంచనా విలువతో ప్రారంభించిన 56 ప్రాజెక్ట్ పనుల అంచనా విలువ 1,54,300 కోట్ల రూపాయలకు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ 56 ప్రాజెక్ట్‌లలో 24 ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో జరిగిన జాప్యం కారణంగా అవి నిర్ణీత గడువులోగా పూర్తి కాలేదు. గడువులోగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో సాంకేతిక, ఆర్థిక, పాలనాపరమైన కారణాలుంటాయి. ఇవి ప్రాజెక్ట్‌కు ప్రాజెక్ట్‌కు వేర్వేరుగా ఉంటాయి. ఆన్‌లైన్ కంప్యూటరైజ్డ్ మానిటరింగ్ వ్యవస్థ (ఓసిఎంఎస్)లో నమోదైన వివరాల ప్రకారం ప్రాజెక్ట్‌లు నిర్ణీత గడువులోగా పూర్తి కాకపోవడానికి ప్రధాన కారణాలలో శాంతి భద్రత సమస్యలు, భూసేకరణలో జాప్యం, పర్యావరణ, అటవీ అనుమతుల్లో జాప్యం, నిధుల ఇబ్బందులు, ప్రాజెక్ట్ నిర్వాసితులకు పునరావాసంలో ఎదురయ్యే ఇబ్బందులు, స్థానిక సంస్థలు, మునిసిపాలిటీ అనుమతుల్లో జాప్యం, కంట్రాక్టర్లతో సమస్యలు ప్రధాన కారణాలని మంత్రి వివరించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్ట్‌ల్లో జాప్యం, అంచనా వ్యయం పెరుగుదలను నివారించి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ప్రగతి కార్యక్రమం కింద వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ప్రాజెక్ట్‌ల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు, ఓసిఎంఎస్ ద్వారా ప్రాజెక్ట్‌ల పర్యవేక్షణ, ఆయా మంత్రిత్వ శాఖల్లో రివైజ్డ్ కాస్ట్ కమిటీల ఏర్పాటు ద్వారా ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం, వ్యయం పెరుగకుండా బాధ్యుతలను అప్పగించడం, మేజర్ ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు సహాయ పడేలా ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సెంట్రల్ సెక్టర్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేషన్ కమిటీల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 2014 జూన్ 30న ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 22 చొప్పున కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌లు అమలులో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. 2023 ఫిబ్రవరిలో ఫ్లాష్ నివేదిక ప్రకారం ఏపీలో 56, తెలంగాణలో 46 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌లు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.
పోలవరం అంచనా వ్యయం 10 వేల కోట్ల నుంచి 55 వేల కోట్లు
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 10,151 కోట్ల నుంచి రూ. 55,548 కోట్ల రూపాయలకు పెరిగినట్లు ఇందర్‌జిత్ సింగ్ జవాబులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 2009లో రూ. 10,151 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 2014 ధరలకు అనుగుణంగా సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,548 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. అంటే 2009లో నిర్ణయించిన అంచనా వ్యయం కంటే మరో 45,397 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నట్లు మంత్రి రావ్ ఇందర్‌జిత్ పేర్కొన్నారు. అలాగే విశాఖపట్నంలో హెచ్‌పీసీఎల్ ఆధ్వర్యంలోని విశాఖ రిఫైనరీ అధునీకరణ ప్రాజెక్ట్‌కు రూ. 20,928 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని జూలై 2020లో అంచనా వేయగా అక్టోబర్ 2023లో సవరించిన అంచనా వ్యయం రూ. 26,264 కోట్లకు చేరిందని చెప్పారు. అంటే 5,336 కోట్ల అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు.
2027 నాటికి కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్
1045 కోట్ల రూపాయల వ్యయంతో కోటిపల్లి-నర్సాపూరం రైల్వే లైన్ ప్రాజెక్ట్‌కు 2001లో ఆమోదం లభించినట్లు మంత్రి తెలిపారు. నాటి అంచనాల ప్రకారం 2009 మార్చి నాటికి ఇది పూర్తి కావలసి ఉంది. నిధుల కొరత, అటవీ భూముల సేకరణలో జరిగిన అసాధారణ జాప్యం కారణంగా ఈ ప్రాజెక్ట్ 216 నెలలు ముందుకు కదలలేదు. తాజాగా 2500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2027 మార్చి నాటికి కోటిపల్లి-నర్సపూర్ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోందని ఆయన బదులిచ్చారు.
ఏపీలో 15 ఆశావహ మండలాలు
కేంద్రం ప్రవేశపెట్టిన ఆశావహ మండలాల అభివృద్ధి కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాల పరిధిలోగల 15 మండలాలను ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి రావ్ ఇందర్‌జిత్ సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2023 జనవరిలో ఆశావహ మండలాల (ఏస్పిరేషనల్ బ్లాక్స్) కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎంపీ విజయసాయికి ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని చిప్పంగి, మద్దికెర, హొలగుండ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై. రామవరం, మారేడుమిల్లి, గంగవరం, అన్నమయ్య జిల్లాలోని కురబలకోట, లక్కిరెడ్డిపల్లె, కోడూరు, వైఎస్సార్ జిల్లాలోని చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు, ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు, ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం, పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని మండలాలలో ఆశావహ మండలాల అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
దేశంలో అభివృద్ధికి నోచుకోని 500 మండలాల్లో సామాజిక అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆశావహ మండలాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 2018 నుంచి వివిధ జిల్లాల్లో అమలు చేస్తున్న ఆశావహ జిల్లాల కార్యక్రమం ఆధారంగా ఆశావహ మండలాల కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు మంత్రి తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు, సూచనలకు అనుగుణంగా అభివృద్దిలో వెనకబడ్డ మండలాలను ఆశావహ మండలాల కింద గుర్తించినట్లు ఆయన వివరించారు. ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం, నీటి వనరులు, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సమ్మిళత్వం, మౌలిక వసతులు, సమగ్ర సామాజిక అభివృద్ధి వంటి ప్రధాన రంగాల్లో సామాజిక-ఆర్థిక సూచికల ఆధారంగా జరిగే పర్యవేక్షణ పైనే ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుందని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.