బ్రిటన్ వెళ్లే వారికి వీసాల జారీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లే విద్యార్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీరితో పాటు వివిధ పనుల కోసం యూకే విజిట్ కోసం వేళ్లే వారికి జారీ చేసే విజిటింగ్ వీసాల జారీలోనూ జాప్యం జరుగుతోంది. బ్రిటన్‌లో ఉన్న తమ వారి వద్దకు వెళ్లాలనుకునే వారు దీని వల్ల వేదనకు గురవుతున్నారు. యూకే వీసాల కోసం విఎఫ్‌ఎస్ గ్లోబల్ ద్వారా అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా 21 పనిదినాల్లో వీసాలు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాని కొంత మంది అప్లయ్ చేసిన రెండు నెలల వరకు కూడా వీసా పొందలేకపోతున్నారు.
బ్రిటన్‌లో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, మెడిసిన్ చేసే విద్యార్ధుల సంఖ్య ఎక్కువగానే ఉంది. వీరి కూడా సకాలంలో వీసాలు రావడంలేదన్న ఆందోళన ఉంది. స్టాండర్డ్ విజిటింగ్ వీసా పొందేందుకు ఆరు వారాల సమయం పడుతుందని బ్రిటీష్ హైకమిషనర్ తెలిపారు. కరోనా తరువాత ఊహించని డిమాండ్ ఏర్పడిందని ఫలితంగానే వీసాల జారీలో జాప్యం జరుగుతుందని వివరించారు. మెడికల్ ఎమర్జెన్సీ వంటి ప్రాధాన్యత ఉన్న వీసాలను మాత్రం ఐదు రోజుల్లో జారీ చేస్తున్నామని హైకమిషర్ ఆ ప్రకటనలో వివరించారు. విద్యార్ధి వీసాలను మూడు వారాల్లోగా జారీ చేయాల్సి ఉంది. అయితే వీటికి కూడా ఆరు వారాలైనా జారీ కావడంలేదు. లండన్ యూనివర్శిటీల్లో సీట్లు పొందిన విద్యార్ధులు విద్యా సంవత్సరం ఆలస్యం అవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.