Tuesday, November 26, 2024

Big Story | మౌలిక వసతుల ప్రాజెక్ట్‌ల్లో జాప్యం.. 4.80 లక్షల కోట్లు పెరిగిన వ్యయం

దేశంలో చేపట్టిన మౌలిక సదుపాయల ప్రాజెక్ట్‌ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇలా ప్రస్తుతం పనులు నడుస్తున్న 408 ప్రాజెక్ట్‌లు నిర్మాణం జాప్యం కారణంగా వీటి వ్యయం 4.80 లక్షలకు పైగా పెరిగిందని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన ప్రకనటలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో జాప్యం జరగడానికి ప్రధానంగా భూ సేకరణలో సమస్యలు, అటవీ శాఖ నుంచి అనుమతులు రావడంలో జాప్యం, మౌలిక సదుపాయల మద్దతు సరిగా లేకపోవడం కారణమని పేర్కొంది. దేశంలో 150 కోట్లకు పైగా వ్యయం అయ్యే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌లను స్టాటిస్టిక్స్‌, ప్రోగ్రామ్‌ ఇంప్లిమెెంటేషన్‌ శాఖ పర్యవేక్షిస్తోంది. మొత్తం 1,681 ప్రాజెక్ట్‌ల్లో 408 ప్రాజెక్ట్‌ల నిర్మాణంలోజాప్యం కారణంగా వ్యయం అంచనాల కంటే పెరిగింది. 814 ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది.

మొత్తం 1,681 ప్రాజెక్ట్‌లను 24,16,872.28 కోట్లతో చేపట్టారు. వీటిని పూర్తి చేసే సమయానికి 28,96,947.15 కోట్లు అవుతుందని అంచనా వేశారు. జాప్యం కారణంగా 4,80,074.87 కోట్లు పెరిగిందని, ఇది ఒరిజినల్‌ అంచనా కంటే 19.86 శాతం ఎక్కువని తెలిపింది. 2023, మే నాటికి ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి వాస్తవంగా అయిన వ్యయం 15,23,957.33 కోట్లుగా ఉంది. ఇది మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయంలో 52.61 శాతం. ఆయా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాల్సిన సమయంలోగా పూర్తి చేయలేకపోతే వాటి నిర్మాణంలో జాప్యం జరుగుతుందని భావిస్తారు.

మొత్తం జాప్యం జరుగుతున్న 814 ప్రాజెక్ట్‌ల్లో 200 ప్రాజెక్ట్‌లు 1నుంచి 12 నెలల జాప్యం జరిగింది. 183 ప్రాజెక్ట్‌ నిర్మాణంలో 13-24 నెలల పాటు ఆలస్యంగా జరుగుతున్నాయి. 300 ప్రాజెక్ట్ నిర్మాణం 25-60 నెలల పాటు జప్యంతో నడుస్తున్నాయి. 131 ప్రాజెక్ట్‌లు అత్యధికంగా 60 నెలల పాటు ఆలస్యంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రధానంగా వివిధ శాఖల నుంచి అనుమతులు పొందడంలో జరుగుతున్న జాప్యం మూలంగానే వీటి నిర్మాణంలో ఆలస్యం జరుగుతోంది. దీనితో పాటు ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ సమస్యలు, ఇంజినీరింగ్‌ సమస్యలు, టెండర్ల పిలవడంలోజాప్యం, ఎక్విప్‌మెంట్‌ సప్లయ్‌, కొన్ని చోట్ల భూసేకరణ సమస్యలు, శాంతిభద్రతల సమస్యలు ఇలా పలు రకాల కారణాల మూలంగా ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోందని ఆ ప్రకటన తెలిపింది. కొవిడ్‌ సమయంలో వివిధ రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ మూలంగా కూడా ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోంది. కొన్నింటి విషయంలో ఆయా శాఖ సవరించిన అంచనాలను సకాలంలో సమర్పించకపోవడం కూడా జాప్యానికి కారణంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement