Tuesday, October 22, 2024

మానవ పరిణామంపై పరిశోధనకు పట్టం! వైద్యరంగంలో స్వీడిష్‌ శాస్త్రవేత్తకు నోబెల్‌ ప్రైజ్‌

వైద్యరంగంలో 2022 సంవత్సరానికి ప్రఖ్యాత నోబెల్‌ బహుమతి స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వరించింది. అంతరించిన మానవజాతుల విశ్వజన్యురాశిపైన, మానవ పరిణామంపైన చేసిన విశేష పరిశోధనలకు గుర్తింపుగా ఆయనను ఈ అత్యున్నత పురస్కారం వరించింది. ఈ మేరకు నోబెల్‌ కమిటీ కార్యదర్శి థామస్‌ పెర్ల్‌మాన్‌ నోబెల్‌ విజేత పేరును ప్రకటించారు.
వైద్యరంగ నోబెల్‌ బహుమతిని అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా పరిగణిస్తారు. స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నోబెల్‌ అసెంబ్లి ఈ అవార్డు విజేతను ఎంపిక చేస్తుంది. ప్రతి ఏడాది డిసెంబర్‌ 10న ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డు విలువ 10 మిలియన్‌ స్వీడిష్‌ క్రోన్‌లు. అంటే 9,00,357 అమెరికన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారుగా 7.20 కోట్లు.
స్వాంటే పాబో పరిశోధనలు పూర్తిగా నూతన శాస్త్రీయ క్రమశిక్షణ వేగాన్ని పెంచాయి. రాతియుగం నాటి నియాండర్తల్‌ మానవుడు నేటి ఆధునిక మానవుడికి బంధువు అనదగ్గవాడు.

ఈ కోణంలో నియాండర్తల్‌ మానవుడి జన్యుక్రమాన్ని స్వాంటే పాబో ఆవిష్కరించారు. అంతేకాదు, ఇప్పటివరకు వెలుగుచూడని డెనిసోవా మానవుడి గుట్టుమట్లను కూడా సంచలనాత్మక రీతిలో ఆవిష్కరించారు. అంతరించిపోయిన మానవుల జన్యువులు ఇప్పటి ఆధునిక హోమోసేపియన్స్‌కు బదిలీ అయిన తీరును వివరించారు. అనేక ఇన్ఫెక్షన్లకు ఇప్పటి మానవుల వ్యాధినిరోధక వ్యవస్థ స్పందించే తీరుకు, జన్యు బదిలీకి మధ్య ఉన్న భౌతిక సంబంధాన్ని విపులంగా తెలిపారు. వైద్యరంగ నోబెల్‌ను ప్రకటించిన నోబెల్‌ ప్రైజ్‌ కమిటీ.. 4న ఫిజిక్స్‌ నోబెల్‌ను, 5న కెమిస్ట్రీ నోబెల్‌ను, 6న సాహిత్య నోబెల్‌ను, 7న నోబెల్‌ శాంతి బహుమతిని, 10న ఎకనామిక్స్‌ నోబెల్‌ను ప్రకటించనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement