Tuesday, November 19, 2024

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌కు డిగ్రీ కాలేజీలు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రతి సంవత్సరం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసే ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌) ర్యాంకింగ్‌ కోసం రాష్ట్రంలోని పలు డిగ్రీ కాలేజీల వివరాలను పంపించనున్నారు. ర్యాంకింగ్‌లో దేశంలోని ఇతర కాలేజీలతోపాటు మన కాలేజీలు కూడా పోటీపడనున్నాయి. ఇందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈమేరకు కసరత్తు చేపడుతోంది. రాష్ట్రంలోని దాదాపు40 నుంచి 50 డిగ్రీ కాలేజీలను ఈసారి ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ కోసం దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. వీటిలో కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలు కూడా ఉంటాయని తెలంగాణ ఉన్నత విద్యామండలిలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నత ప్రమాణాలు పాటించే కళాశాలలను ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో పోటీ పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 93 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు న్యాక్‌ గుర్తింపు లభించిందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement