Tuesday, November 26, 2024

డిఫెన్స్‌ హబ్‌గా భాగ్యనగరం!

మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఎంవోయూ
మరో రూ.1000 కోట్లు పెట్టుబడి

స్థానిక కంపెనీ వీఈఎమ్‌ రెడీ
ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం
భారీగా తరలివస్తున్న కంపెనీలు
ఏరోస్పేస్‌లో భారీగా పెట్టుబడులు
సప్లయర్స్‌గా అవతరిస్తున్న స్థానిక కంపెనీలు
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాజధాని హైదరాబాద్‌ భారీ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ హబ్‌గా అవతరించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలో 1000 వరకు ప్రైవేట్‌ డిఫెన్స్‌ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌కు చెందిన వీఈఎమ్‌ టెక్నాలజీస్‌ కంపెనీతో జహీరాబాద్‌లో రూ.1000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆదివారం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. జహీరాబాద్‌లోని ఎల్గోయి గ్రామంలో ప్రపంచ స్థాయి వెపన్‌ సిస్టమ్స్‌ను వీఈఎమ్‌ కంపెనీ తయారు చేయనుంది. ఈ ప్రాజెక్టులో కంపెనీ 2000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు చెందిన వీఈఎమ్‌ టెక్నాలజీస్‌ 1988లో స్థాపించారని, ఈ కంపెనీ ప్రస్తుతం రక్షణ రంగంలో భారీ ఎత్తునకు ఎదిగిందని కొనియాడారు. ఏరోస్పేస్‌, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్‌ కేరాఫ్‌గా ఉందని అన్నారు. వీఈఎమ్‌ టెక్నాలజీస్‌ సీఎండీ వెంకటరాజును ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రశంసలతో ముంచెత్తారు. బోయింగ్‌, లాక్‌హిడ్‌ మార్టిన్‌, జీఈ, సఫ్రాన్‌ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్‌లో ఏరోస్పేస్‌ రంగంలో పెట్టుబడులు పెట్టాయన్న విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఈ తరహా భారీ కంపెనీలకు హైదరాబాద్‌కు చెందిన స్థానిక తయారీ కంపెనీలు సప్లయర్స్‌గా ఉండడం గర్వకారణమన్నారు. బీడీఎల్‌ తయారు చేస్తున్న ఆకాష్‌ మిసైల్స్‌కు వీఈఎమ్‌ విడిభాగాలు తయారు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సభ్యులు వీకే సారస్వత్‌, డీఆర్‌డీవో చైర్మన్‌ సతీష్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement