Monday, November 25, 2024

మేనకా గాంధీపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా.. బీజేపీ ఎంపీకి ఇస్కాన్‌ నోటీసు

బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న ఇస్కాన్‌ రూ.100 కోట్లకు పరువు నష్టం నోటీసును శుక్రవారం పంపించింది. ఇస్కాన్‌ను దేశంలోనే అతిపెద్ద మోసకారి సంస్థ అని ఆరోపించడంతో పాటు ఇస్కాన్‌కు చెందిన గోశాలల్లోని ఆవులను వధ్యశాలలకు విక్రయిస్తున్నారంటూ మేనకా గాంధీ విమర్శించడంతో ఇస్కాన్‌ ఆమెకు నోటీసు పంపించింది.

”ఇస్కాన్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసిన మేనకా గాంధీకి రూ.100 కోట్లకు పరువు నష్టం నోటీసును నేడు మేము పంపించాం. ఆమె చేసిన దారుణమైన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్‌ భక్తులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులను తీవ్రంగా బాధించాయి. ఇస్కాన్‌కు వ్యతిరేకంగా జరిగే దుష్ప్రచారంపై న్యాయ పోరాటం చేయడంలో అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని మేం జారవిడుచుకోం” అని ఇస్కాన్‌ కోల్‌కతా కేంద్రం ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి రాధారమణ్‌దాస్‌ పేర్కొన్నారు.

మేనకా గాంధీ ఇస్కాన్‌పై చేసిన ఆరోపణలతో కూడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఇస్కాన్‌ చర్యకు ఉపక్రమించింది. సదరు వీడియోలో ఆమె ఇస్కాన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఇస్కాన్‌కు చెందిన గోశాలను సందర్శించినప్పుడు అక్కడ వట్టిపోయిన ఆవు లేదా దూడలు కానీ తనకు కనిపించలేదని, వాటిని వధ్యశాలలకు విక్రయించేశారని బీజేపీ ఎంపీ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement