భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి తన సత్తా చాటింది. పారిస్‌లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్జేజ్-3లో తన అద్భుత ప్రదర్శనతో భారత్‌కు మూడు బంగారు పతకాలను అందించిన దీపికా కుమారి మహిళల విభాగంలో ఆర్చరీ ర్యాంకుల్లో నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది. ఆదివారం నాడు మహిళల రికర్వ్, మిక్సెడ్ టీమ్‌తో పాటు వ్యక్తిగత విభాగంలోనూ దీపిక సత్తాచాటింది. దాంతో.. ఒకేరోజు భారత్‌కి మూడు బంగారు పతకాలు లభించాయి. మిక్సెడ్ టీమ్ విభాగంలో తన భర్త అతాను దాస్‌తో కలిసి దీపిక పతకం గెలవడం విశేషం.
కాగా మూడు స్వర్ణాలు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉందని, మున్ముందూ ఇదే తరహాలో తన ప్రదర్శన ఉండాలని దీపికా కుమారి అభిప్రాయపడింది. ప్రపంచకప్ టోర్నీలకు దూరంగా ఉన్న కొరియా, చైనా, జపాన్, చైనీస్ తైపీ క్రీడాకారిణుల నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో తీవ్రమైన పోటీ ఉంటుందని.. తన ఆటలోని లోపాలను సరిదిద్దుకుంటూ టోక్యోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలిపింది.