ఢిల్లీ – డీప్‌ఫేక్ అనేది ప్రస్తుతం భారత వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుల్లో ఒకటిని, ఇది సమాజంలో గందరగోళానికి కారణమవుతోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ దీపావళి మిలన్ కార్యక్రమంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. డీప్‌ఫేక్‌ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని దుర్వినియోగం చేసే విషయంలో పౌరులు, మీడియా సిబ్బంది ఇద్దరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
”తాను పాడినట్లు ఓ వీడియో వైరల్ అయిందని, తెలిసిన వాళ్లు కొందరు దాన్ని నాకు ఫార్వర్డ్ చేశారని, ఈ డీప్‌ఫేక్ వీడియోలపై మీడియా, జర్నలిస్టులు, ప్రజలు తప్పనిసరిగా అవగాహన కల్పించాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పించాలి.” అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రధాని తన ప్రసంగంలో తాను గర్భా చేస్తున్న డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడారు. ఇది నిజమైందిగా ఉందని, తాను చిన్నప్పటి నుంచి గర్భా ఆడలేదని చెప్పారు. మహిళలతో మోడీని పోలి ఉన్న వ్యక్తి గర్భా చేస్తున్నట్లు సృష్టించిన ఓ డీప్ ఫేక్ వీడియో ఇటీవల బాగా వైరల్ అయిన నేపథ్యంలో ప్రధాని దీనిపై స్పందించారు. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయితే వెంటనే ప్లాగ్ చేసి, వార్నింగ్ ఇవ్వాలని చాట్‌జీపీటి బృందాన్ని కోరినట్లు ప్రధాని వెల్లడించారు.
ఇటీవల పలువురు సినీ స్టార్ల డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. రష్మికా మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంపై చాలా మంది సెలబ్రెటీలు దీనిపై స్పందించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటన తర్వాత కాజోల్ కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు.