- రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం…
- అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా పథకం అమలు…
- పథకంపై లబ్ధిదారుల మనోగతాన్ని తెలుసుకుంటున్న ప్రజాప్రతినిధులు..
- కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు…
- రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్…
- ( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగు పరిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దీపం-2 పథకం ద్వారా లబ్ధిపొందిన వారి సంఖ్య మూడు వారాల్లోనే 50లక్షల మైలురాయిని చేరుకోవడం గర్వకారణమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం విజయవాడ, కృష్ణలంకలోని కోత మిషన్ రోడ్డు ప్రాంతంలో జరిగిన దీపం-2 ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్, పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీ, ఎండీ జి.వీరపాండ్యన్, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా, విజయవాడ ఆర్డీవో కె.చైతన్య తదితరులు పాల్గొని లబ్ధిదారు ఎం.కోటేశ్వరమ్మ, కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. గ్యాస్ స్టవ్‌పై టీ కాచి, రుచి చూశారు.
మాలాంటి కుటుంబాలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తే.. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2,476.50 ప్రయోజనం లభిస్తుంది. ఇలాంటి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నామని చెబుతూ ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటీ 55 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని.. దీపావళి పండుగ రోజు ప్రతి మహిళ కళ్లల్లో సంతోషం నింపే విధంగా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించే దీపం-2 పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో లాంఛనంగా ప్రారంభించారని.. పథకం విజయవంతంగా అమలవుతోందని పేర్కొన్నారు.
నారా చంద్రబాబు నాయుడు 1999లో దేశంలోనే మొదటిసారిగా మహిళల ఆరోగ్య భద్రత గురించి ఆలోచించి కట్టెల పొయ్యి పొగతో అనారోగ్య సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో దీపం పథకాన్ని ప్రారంభించారని వివరించారు. గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే చాలని ఇప్పుడు దీపం-2 పథకం ద్వారా లబ్ధిపొందొచ్చన్నారు. అయితే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, గ్యాస్ కనెక్షన్ల సంఖ్యపై కూడా అవగాహన లేకుండా కోటి 85 లక్షలు అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. మూడు గ్యాస్ కంపెనీలు అందించిన సమాచారం మేరకు రాష్ట్రంలో కోటి 55 లక్షల 200 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి పథకం అందేలా రూ. 894 కోట్ల అడ్వాన్సును గ్యాస్ కంపెనీలకు అందజేయడం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలోని మహిళల సంక్షేమం లక్ష్యంగా, వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారన్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి సంబంధించి ఇప్పటివరకు కేవలం 521 ఫిర్యాదులు మాత్రమే అందడం కార్యక్రమం అమల్లో పారదర్శకత, నిజాయితీకి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఇంటిలో సంతోషం నింపాలని, 48 గంటల్లోనే బ్యాంకు ఖాతాలో నిధులు జమవుతున్నాయని వివరించారు. మరింత మెరుగైన సేవలందించే విధంగా స్థానిక గ్యాస్ కంపెనీలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి లబ్ధిదారునికి పథకం ద్వారా లబ్ధి చేకూరేలా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు.
అత్యంత పారదర్శకంగా పథకం అమలు..
అత్యంత పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కట్టెల పొయ్యితో వంట చేస్తూ మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆనాడు దీపం పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఇప్పుడు దీపం-2 పథకాన్ని కూడా ప్రారంభించి, విజయవంతంగా అమలయ్యేలా కృషిచేయడం జరుగుతోందన్నారు. పథకం ద్వారా 21 రోజుల్లోనే 50 లక్షల మంది లబ్ధిపొందడం చాలా ఆనందం కలిగిస్తోందన్నారు. అతి తక్కువ ఫిర్యాదులు నమోదు కావడం ఈ పథకం అమలు పారదర్శకతకు నిదర్శనమన్నారు.
లబ్ధిదారులు కూడా దీపం-2 పథకంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని.. గ్యాస్ సిలిండర్ అందుకున్న వెంటనే వారి ఖాతాల్లో డబ్బు జమవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మున్ముందు కూడా విజయవంతంగా అమలుచేసేందుకు కూటమి నేతలు పరస్పర సహకారంతో పనిచేయడం జరుగుతుందన్నారు. ఏదైనా సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్వో ఎ.పాపారావు, తహసీల్దార్ ఎం.వెంకటరామయ్య, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.