న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత్ ఎదుర్కొంటున్న ముప్పుల్లో డీప్ ఫేక్ ఒకటని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన ‘దీపావళి మిలన్’ సందర్భంగా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీప్ ఫేక్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా మీడియా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డీప్ ఫేక్ పరిజ్ఞానంతో మార్ఫింగ్ చేసిన ఫొటోలు, వీడియోలు సమాజంలో అలజడి సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తాను గార్భా నృత్యం చేస్తున్నట్టుగా ఓ వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేశారని, అది చూసి తానే ఆశ్చర్యపోయానని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగంలో ‘డీప్ ఫేక్’ ఫొటోలు, వీడియోలు విస్తరిస్తూ ఓ పెద్ద సంక్షోభానికి దారితీస్తున్నాయని వ్యాఖ్యానించారు. సమాజంలో అసంతృప్తిని ఓ దావాగ్నిలా వ్యాప్తిచేయగల సామర్థ్యం వీటికి ఉందని అన్నారు. అసలు డీప్ ఫేక్ అంటే ఏంటి అన్న అంశంతో పాటు దాని పర్యవసానాలపై ఉదాహరణలతో సహా ప్రజలకు వివరించి, అవగాహన కల్గించాలని ప్రధాని మోదీ మీడియా ప్రతినిధులకు సూచించారు.
సినీ తారలు రష్మిక మందన్న, కత్రినా ఖైఫ్, కాజోల్ ఫొటోలు, వీడియోలను డీప్ ఫేక్ పరిజ్ఞానంతో అశ్లీలంగా తయారుచేసిన ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఇది కేవలం సినీ తారలకే పరిమితం కాదని, రాజకీయాలతో పాటు సమాజంలో అన్ని రంగాల్లో దీన్ని ఉపయోగించి ప్రత్యర్థుల ప్రతిష్ట దెబ్బతీసే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ అంశంపై మాట్లాడ్డం గమనార్హం.
ఈ అంశంతో పాటు ‘వోకల్ ఫర్ లోకల్’ గురించి వివరిస్తూ.. ఒక్క వారంలో రూ. 4.5 లక్షల కోట్ల వాణిజ్యం జరిగిందని, ఇది గొప్ప విజయం అని వెల్లడించారు. దేశంలోని ఓ చిన్న వ్యాపారవేత్త కూడా ఆదాయం గడించాడని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో భారత్ సాధించిన విజయాలు, తద్వారా పొందిన స్ఫూర్తితో దేశ ప్రజలు వివిధ రంగాల్లో దూసుకుపోతున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు.
మరోవైపు తీవ్రమైన ఒత్తిళ్ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న యువ జర్నలిస్టుల గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. “యువ జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు విచారకరం. మన జీవితాలు తీవ్రమైన ఒత్తిడితో కూడుకున్నవి. నలభై ఏళ్లు దాటిన తర్వాత క్రమానుగతంగా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. యువ పాత్రికేయులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు తలెత్తకుండా ఆయా మీడియా సంస్థలు, ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాలి” అంటూ మోదీ వ్యాఖ్యానించారు.