Sunday, November 24, 2024

Deeksha Diwas – 29న జిల్లా కేంద్రాల్లో దీక్షా దివ‌స్ – కేటీఆర్

హైద‌రాబాద్ – ఆంధ్ర‌ప్ర‌భ : కాంగ్రెస్ కబంధహస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలని మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటలను కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ చ‌రిత్ర‌లో ఉద్య‌మ‌నేత‌, మాజీ సీఎం కేసీఆర్‌ది చెర‌గ‌ని ముద్ర అని అన్నారు. . 2009 నవంబర్ 29వ తేదీ.. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలపు తిరిగిందన్నారు. కేసీఆర్ దీక్ష తెలంగాణ‌పై చెరగని ముద్ర వేసిందని గుర్తు చేశారు. న‌వంబ‌ర్ 29వ తేదీన 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివ‌స్ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు.

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా..తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏప్రిల్ 27, 2001 నాడు గులాబీ జెండాను ఎగరవేసిన నాయకులు కేసీఆర్ అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పి.. 60 ఏళ్ల‌ తెలంగాణ ఉద్యమ చరిత్ర పై కేసీఆర్ చెరిగిపోని సంతకం చేసిన మహానాయకుడు అని కొనియాడారు.

మ‌హోజ్వ‌ల ఉద్య‌మానికి మ‌లుపు తిప్పిన రోజు2009, న‌వంబ‌ర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష మ‌హోజ్వ‌ల ఉద్య‌మాన్ని మ‌లుపుతిప్పిన రోజు అని కేటీఆర్ చెప్పారు. న‌వంబ‌ర్ 29, 2009 స్వ‌రాష్ట్ర క‌ల సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చ‌రిత్ర‌లో నిలిచిపోయే శుభ‌దినమ‌న్నారు.

- Advertisement -

మూడు కోట్ల తెంగాణ ప్ర‌జ‌లు ముక్త‌ కంఠంతో మా తెలంగాణ మాకు కావాల‌ని నిన‌దించారు. కేసీఆర్ స‌చ్చుడో తెలంగాణ తెచ్చుడో అని తెగువ‌ను ప్ర‌ద‌ర్శించిన నాయ‌కుడికి అండ‌గా నిల‌బ‌డ్డారు. అంద‌ర్నీ మెప్పించి ఒప్పించి, దేశ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను, రాష్ట్రంలో ఉండే రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను కుల‌మ‌తాల‌కు అతీతంగా క‌లిపింది దీక్షా దివ‌స్ అని కేటీఆర్ గుర్తు చేశారు.

ఘ‌నంగా దీక్షా దివ‌స్‌…

ఈ నెల‌ 29న 33 జిల్లా పార్టీ కార్యాల‌యాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివ‌స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ నాయ‌క‌త్వం.. ఉద్య‌మంలో కానీ, ప‌రిపాల‌న‌లో కానీ చెర‌గ‌ని ముద్ర వేసింద‌న్నారు. రెండు జాతీయ పార్టీల‌కు బుద్ది చెప్పే విధంగా క‌దం తొక్కుతామ‌న్నారు.

29న దీక్షా దివ‌స్‌తో పార్టీ శ్రేణులు క‌దం తొక్కాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అన్ని జిల్లాల‌కు సీనియ‌ర్ నాయ‌కుల‌ను ఇంచార్జిలుగా నియ‌మించామ‌ని, ఈ నెల 26న ప్ర‌తి జిల్లాలో ముఖ్య నాయ‌కులు కార్య‌క‌ర్త‌ల‌తో స‌న్నాహాక‌ స‌మావేశాలు నిర్వ‌హిస్తార‌ని తెలిపారు.

డిసెంబ‌ర్ 9న మేడ్చ‌ల్ తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌తో దీక్షా దివ‌స్ ముగిస్తామ‌ని తెలిపారు. తెలంగాణ త‌ల్లికి ప్ర‌ణ‌మిల్లుతూ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంద‌రూ పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు.

29న నిమ్స్ హాస్పిట‌ల్‌లో అన్న‌దానం

ఈ నెల 29న దీక్షా దివ‌స్ కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని, ఇందులో భాగంగా నిమ్స్ హాస్పిట‌ల్ లో అన్న‌దానం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. మ‌లిదశ తెలంగాణ ఉద్య‌మంలో నిమ్స్ హాస్పిట‌ల్ పాత్ర కూడా ఎంతో ఘ‌న‌మైంద‌ని, నాడు కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో నిమ్స్‌కు త‌ర‌లించ‌డంతో అక్క‌డ‌ క‌ద‌న రంగంగా మారిపోయంద‌ని గుర్తు చేశారు. మ‌లిద‌శ ఉద్య‌మానికి కేంద్ర బిందువుగా మారిన నిమ్స్ హాస్పిట‌ల్‌లో అన్న‌దానం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు.

కాంగ్రెస్ క‌బంధ హ‌స్తాల నుంచి కాపాడుకుందాం.

స‌మైక్య రాష్ట్రంలో అప్ప‌టి కాంగ్రెస్ పాల‌న‌లో ప్ర‌తి వ‌ర్గం, ప్ర‌తి మ‌నిషి బ‌తుకు చిధ్ర‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని, మ‌ళ్లీ ఇవాళ ఆ ప‌రిస్థితితులు తిరిగి క‌న‌బ‌డుతున్నాయ‌ని అన్నారు. అదే నిర్బంధం, అదే అణిచివేత‌, అవే దుర్భ‌ర‌ ప‌రిస్థితులు, ఆందోళ‌న‌క‌ర‌మైన ప‌రిస్థితి క‌న‌బ‌డుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నాడు ఢిల్లీ మెడ‌లు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో నేడు మ‌ళ్లీ రెండు ఢిల్లీ పార్టీ మెడ‌లు వంచాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెప్పారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణ‌లో బతుకు అంధ‌కార‌మైంద‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement