కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల జనవరి నుంచి గోధుమల ధరలు తగ్గుతున్నాయి. బహిరంగ మార్కెట్లో 30 లక్షల టన్నుల ధాన్యాలను విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తరువాత గోధుమల ధర కిలోకు 5 రూపాయలు తగ్గిందని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. ధరలను నియంత్రించేందుకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
గోధుమ పిండి ధరలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని సంజీవ్ చోప్రా తెలిపారు. అవసరమైతే బహిరంగ మార్కెట్ విక్రయ పథకం ద్వారా మరిన్ని గోధుమలను విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ధరలు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని, వినియోగదారులకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గోధుమలు, గోధుమ పిండి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ప్రస్తుతానికి ఎత్తివేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.
హోల్సేల్ మార్కెట్లో క్వింటాలు గోధుమ ధర 3,000 నుంచి 2,500 రూపాయలకు తగ్గిందని సంజివ్ చోప్రా చెప్పారు. రిటైల్ మార్కెట్లో క్వింటాలుకు 3,300-3,400 నుంచి 2,800, 2,900 వరకు తగ్గినట్లు చెప్పారు. గోధుమల ధరను నియంత్రించేందుకు గత నెల కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి 30 లక్షల గోధుమలను విక్రయించనున్నట్లు ప్రకటించింది.