హైదరాబాద్, ఆంధ్రప్రభ: కొన్ని సంవత్సరాల క్రితం వరకూ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) కోర్సులకు యమ డిమాండ్ ఉండేది. డీఎడ్ సీటు కోసం విపరీతమైన పోటీ ఉండేది. కొంతమందైతే పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడ డీఎడ్‌కు సమాన కోర్సులు చేసేవాళ్లు. డీఎడ్ చేస్తే ఉపాధ్యాయ పోస్టు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) కొలువు ఖాయమనే నమ్మకం, భరోసా విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. డీఎడ్ సీటుకు డిమాండ్ కాదుకదా..అసలు ఉన్న సీట్లే నిండట్లేదు. ప్రతీ సంవత్సరం దాదాపు 50 శాతం వరకు సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. సీట్లు భారీగా ఉంటున్నప్పటికీ చేరే విద్యార్థులు తక్కువగా ఉంటున్నారు. ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించకపోవడంతో డీఎడ్ కాలేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
దీంతో కాలేజీలు మూతపడుతున్నాయి. ఐదేళ్లలో 137 కాలేజీలు మూతపడ్డాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అంచనా వేయొచ్చు. ఇదే పరిస్థితి ఇలానే ఉంటే రానున్న రోజుల్లో డీఎడ్ కోర్సు ఉండే అవకాశం కూడా తక్కువే. ఈ కోర్సు చేస్తే ఉద్యోగాలు దక్కుతాయనే భరోసా విద్యార్థులకిచ్చినప్పుడే ఈ కోర్సుకు డిమాండ్ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల సంఖ్య పెంచి నోటిఫికేషన్ ద్వారా ప్రతీ ఏటా పోస్టులను భర్తీ చేయాలి. అంతేకాకుండా ప్రైవేట్ స్కూళ్లల్లోనూ డీఎడ్ అర్హత ఆధారంగానే టీచర్ ఉద్యోగాలు దక్కుతాయనే భరోసా ఈ కోర్సు చేసే వారికి కల్పించాల్సి ఉంటుంది.
ఐదేళ్లలో 137 కాలేజీలు మూత…
ఒకప్పుడు ఎంతో డిమాండ్ ఉన్న డీఎడ్ సీట్లు ప్రస్తుతం నిండట్లేవు. గతంలో డీఎడ్ కోర్సు చేసిన వారు ఎస్జీటీ టీచర్ పోస్టుకు మాత్రమే అర్హులుగా, బీఎడ్ చేసిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు మాత్రమే అర్హులుగా ఉండేది. కానీ ఈమధ్యకాలంలో అర్హతలు మార్చడంతో బీఎడ్ పూర్తి చేసినవారు అటు ఎస్జీటీకి ఇటు స్కూల్ అసిస్టెంట్‌కు అర్హులుగా నిర్ణయించడంతో డీఎడ్ కోర్సుల్లో చేరేవారు లేక కాలేజీలు మూతపడుతున్నాయి. ఇటీవల కాలంలో 130కి పైగా కాలేజీలు మూతపడ్డాయి. 2016-17లో తెలంగాణలో 212 డీఎడ్ కాలేజీలు ఉండేవి. 2019-20 వరకు తెలంగాణలో 175 కాలేజీలుంటే, 2020-21లో ఆ సంఖ్య 100 కాలేజీలకు పడింది. ప్రస్తుతం ఇప్పుడు కేవలం 75 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. వీటిలోనూ 65 ప్రైవేట్ కాలేజీలు కాగా, 10 ప్రభుత్వ కాలేజీలు. మరికొన్ని మూసివేతకు సిద్ధమవుతున్నాయి. 2017-18లో 11,500 సీట్లుంటే, ఆ ఏడాది 7,650 మందే చేరారు. 2020-21లో 6250 సీట్లలో 2828 మందే చేరారు. ఈ ఏడాది 75 కాలేజీల్లో మొత్తం 4700 సీట్లు మాత్రమే ఉన్నాయి.
4700 సీట్లలో సగం సీట్లు నిండలే..
డీఎడ్ సీట్ల మూడవ విడత సీట్ల కేటాయింపును అధికారులు మంగళవారం పూర్తి చేశారు. 4700 సీట్లకు మొదటి, రెండు, మూడో విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే ఈ 4700 సీట్లల్లో తెలుగుమీడియం సీట్లు 2250, ఇంగ్లీష్ మీడియం 1950, ఉర్దూమీడియం సీట్లు 500 ఉన్నాయి. మొదటి విడతలో మూడు మాధ్యమాలకు కలిపి 1692 సీట్లు భర్తీ కాగా, రెండో విడతలో 626 సీట్లు, మూడో విడతలో 233 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మీడియం వారీగా చూసుకుంటే తెలుగు మీడియం సీట్లు 1115, ఇంగ్లీష్ మీడియం సీట్లు 1034, ఉర్దూమీడియం 402 సీట్లు భర్తీ అయ్యాయి. 4700 సీట్లలో మూడు విడతల్లో కలిపి మొత్తం భర్తీ అయినవి కేవలం 2551 మాత్రమే. ఇంకా 2149 సీట్లు మిగిలిపోయాయి. మూడో విడత సీట్ల కేటాయింపు ఈనెల 14న జరగడంతో సీటు పొందిన అభ్యర్థులు తమ సీటును రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ రకంగా చూసుకుంటే మూడో విడత 233 సీట్లల్లో ఇంకా కొన్ని సీట్లు మిగలనున్నాయి. మూడో వితలో సీటు పొందిన విద్యార్థులు ఈనెల 17వరకు కాలేజీల్లో ఫీజు చెల్లించాలి. 21లోపు అలాట్‌మెంట్ లెటర్ కాలేజీలకు అందజేయాల్సి ఉంటుంది.
ఫీజులు అందక…నోటిఫికేషన్లు వెలువడక!…
యాజమాన్య కోటా కింద ప్రతీ కాలేజీకి పది సీట్లుంటాయి. కన్వీనర్ కోటా సీటు నిండితేనే యాజమాన్య సీట్ల కింద చేరతారు. ప్రస్తుతం కన్వీనర్ కోటా సీట్లు నిండే పరిస్థితేలేదు. ఇక యాజమాన్య సీట్లకు దిక్కు ఎక్కడిది. కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం ఏటా రూ.11వేల ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.1500 ఇతర ఖర్చుల కింద కాలేజీలకు ఇస్తోంది. ఇవి సమయానికి కాలేజీలకు అందడంలేదు. దీంతో కాలేజీల నిర్వహణ భారమవుతోంది. అధ్యాపకులకు వేతనాలు చెల్లించడం మరింత కష్టతరమవుతోంది. దీనికి తోడు ప్రభుత్వం వరుసగా టీచర్ నోటిఫికేషన్లు వేస్తే ఈ కోర్సుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తద్వారా డీఎడ్ సీటుకు డిమాండ్ పెరుగుతోంది. 2008లో డీఎస్సీ, 2012 డీఎస్సీ, 2017లో టీఆర్టీ నోటిఫికేషన్లు పడ్డాయి. మళ్లిd ఇంతవరకూ డీఎస్సీ లేదా టీఆర్టీ నోటిఫికేషన్ వెలువడనేలేదు.