అమరావతి, ఆంధ్రప్రభ: విద్యుత్ సబ్సిడీని సవరించడం, ఫీడ్ ధరలు ఆకాశాన్నంటడంతో రాష్ట్రంలో ఆక్వా కల్చర్ సాగు తగ్గుముఖం పడుతోంది. ఈఏడాది ఆగస్టులో చేపలు, రొయ్యల సాగు ప్రారంభం కావల్సి ఉంది. కానీ, ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది తక్కువగానే సాగు నమోదైనట్లు తెలుస్తోంది. దీనికి పెరిగిన ఫీడ్ ధరలతోపాటు విద్యుత్ సబ్సిడీ అందకపోవం కారణాలుగా రైతులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కౌలు రైతులు ఈ ఆగస్టులో సాగు ప్రారంభించేందుకు వెనుకాడారని ఆక్వా వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం స్వంత చెర్వులు ఉన్న యజమానులు మాత్రమే ఈసారి ఆక్వా సాగు చేస్తున్నారని, వారికి చెర్వు కౌలు భారం లేకపోవడం వల్ల పెట్టుబడి తక్కువగా ఉంటుంన్నందున వారు మాత్రమే సాగు చేస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్ర ఆదాయంలో కీలక పాత్ర పోషించే ఆక్వా సాగు తగ్గుముఖం పట్టడం పట్ల అటు ఆక్వా రంగ నిపుణులు, ఇటు ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆక్వా కల్చర్‌కు యూనిటుకు రూ. 1.50 సబ్సిడీ రేటు-ను ప్రకటించి 2019లో అమలులోకి తెచ్చారు.
ఆ తరువాత ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలను సవరిస్తూ జీవో విడుదల చేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం ఐదు ఎకరాల్లోపు రొయ్యలు, చేపలు సాగు చేసే రైతులు యూనిట్‌కు రూ.1.50 చెల్లించాల్సి ఉండగా, ఐదెకరాల కంటే ఎక్కువ సాగు చేసే రైతులు యూనిట్‌కు రూ.3.85 చెల్లించాల్సి ఉంది. ట్యాంకుల పరిధితో సంబంధం లేకుండా ఆక్వా జోన్ల వెలుపల ఉన్న అన్ని చేపలు, రొయ్యల ట్యాంకులకు రూ.3.85 వసూలు చేయాలి. విద్యుత్ టారిఫ్ రాయితీ ప్రస్తుతానికి ఇ-ఫిష్ డేటా ఆధారంగా చేపలు, రొయ్యల చెర్వులకు అందించబడుతుంది. తరువాత, జీవో ప్రకారం, ఏపీఎస్‌ఏడీఏ చట్టం, 2020 కింద రిజిస్టర్ చేయబడిన చేపలు, రొయ్యల పెంపకం చెర్వులకు మాత్రమే విద్యుత్ టారిఫ్ రాయితీ వర్తిస్తుంది. సేకరించిన సమాచారం ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 3.75 లక్షల ఎకరాల్లో ఆక్వా కల్చర్ సాగవుతోంది. ఇందులో దాదాపు 55 శాతం మంది రైతులు నాన్ ఆక్వా జోన్లలోనే సాగు చేస్తున్నారు. 95 శాతం కంటే ఎక్కువ మంది రైతులు 5 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఆక్వాకల్చర్, ముఖ్యంగా రొయ్యలను సాగు చేస్తున్నారు, రొయ్యల పెంపకానికి చెరువులలో వాటి ఆరోగ్యవంతమైన పెరుగుదలకు ఆక్సిజన్ పొందేందుకు ఏరేటర్లు మరియు సూర్యకాంతి అవసరం. సాధారణంగా, ఏరేటర్లకు రోజుకు 16 గంటల వరకు విద్యుత్ సరఫరా అవసరం ఉంటుంది. చెరువుల్లోకి మరియు వెలుపల నీటిని క్రమం తప్పకుండా పంపింగ్ చేయడానికి కూడా విద్యుత్ అవసరం. ఒక ఎకరం కల్చర్‌కు ఒక నెలపాటు ఎరేటర్లు మరియు నీటి పంపులను నడపడానికి దాదాపు 10 హెచ్పీ విద్యుత్ సరఫరా అవసరమవుతుంది.
తగ్గిన సాగు విస్తీర్ణం..
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అధిక దాణా ధరలు మరియు విద్యుత్ సబ్సిడీపై అనిశ్చితి కారణంగా చాలా మంది ఆక్వా రైతులు ఈ ఆగస్టులో ఆక్వా సాగును చేపట్టలేదు. విద్యుత్ రాయితీలు జోన్‌ల ఆధారంగా ఉండటం, పెద్ద సంఖ్యలో రైతులు జోన్‌ల వెలుపల ఉన్నందున సబ్సిడీ పథకం నుండి మినహాయించబడ్డారు. దీంతో రైతులు ఆక్వాకల్చర్‌ను చేపట్టేందుకు వెనకాడుతున్నారు. ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీని వర్తింపజేయకపోవడమే కాకుండా, దాణా ధరలను తగ్గించకపోవడం లేదా నియంత్రించడంతో వివిధ పన్నుల ద్వారా ప్రభుత్వానికి రూ. 6 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆక్వా వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని వారు పేర్కొంటున్నారు. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగును మరింతగా ప్రోత్సహించేలా విద్యుత్ సబ్సిడీలు పునరుద్ధరించడంతోపాటు పెరిగిన ఫీడ్ ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆక్వా రైతాంగం కోరుతోంది.