దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణలోకి వచ్చింది. వైరస్ తీవ్రత ప్రారంభ రోజుల స్థాయికి పడిపోతోంది. కొద్దిరోజులుగా కొత్త కేసులు 3-5 వేల మధ్య నమోదవుతున్నాయి. శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తాజాగా 8 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,614 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మరో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 4.29 కోట్ల మందికి కరోనా సోకగా, 5.15 లక్షల మంది మరణించారు.
కాగా, ఇప్పటి వరకు 4.24 కోట్ల మంది కోలుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 5 వేల మందికి పైగా కొవిడ్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 40,559కు చేరింది. మొత్తం కేసుల్లో ఆ వాటా 0.9 శాతం మాత్రమే. రికవరీ రేటు 98.71 శాతానికి చేరి ఊరటనిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తాజాగా 18.18 లక్షల మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 179 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..