Tuesday, November 26, 2024

మిర్చి ధరల తిరోగమనం.. గుంటూరు యార్డులో పేరుకుపోతున్న నిల్వలు

గుంటూరు, ప్రభన్యూస్‌ బ్యూరో: ఎర్ర బంగారంగా పిలువబడే మిర్చి ధరలు పడిపోతుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వాతావరణం అనుకూలించి ఈ ఏడాది దిగుబడి బాగా రావడం.. ధరలు సీజన్‌ మొత్తం నిలకడగా కొనసాగడంతో రైతులు లాభాలు చవిచూశారు. తొలి కొత కాయ అమ్మకాలు పూర్తయి చివరి కోత మార్కెట్‌కు వస్తుండడంతో నాణ్యత పేరుతో ధరల్లో కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు ఇప్పటికీ ఇతర జిల్లాలు, సరిహద్దు రాష్ట్రాల నుంచి గుంటూరు యార్డుకు మిరప కాయ దిగుమతవుతోంది. రెండు వారాల క్రితం ఉన్న ధరతో పోలిస్తే క్వింటాల్‌కి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు తగ్గింది. ప్రస్తుతం క్వింటాల్‌కి రూ.18 వేల వరకు సగటు ధర లభిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

మరో మూడు వారాల్లో యార్డుకు వేసవి సెలవులు రానుండటంతో రైతులు తమ వద్ద ఉన్న మిర్చిని శీతలగిడ్డంగుల్లో నిల్వ చేసి జూన్‌ తర్వాత మార్కెట్‌ని బట్టి విక్రయించుకోవాలని ఆలోచిస్తున్నారు. నగదు అవసరం ఉన్న వాళ్లు మాత్రం వచ్చిందే దక్కుదల అన్నట్లుగా అమ్మేసుకొంటున్నారు. అయితే ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో గుంటూరు యార్డుకు దిగుమతి అయిన నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. దీంతో యార్డులో సరుకు కొనుగోళ్లు పూర్తయ్యేవరకు తీసుకురావద్దని రైతులకు సూచిస్తున్నారు.

ఎగుమతి రకాలకు గిరాకీ..

మిర్చియార్డుకు ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాలు, కర్నూలు, కర్ణాటక, ప్రత్తిపాడు పరిసర గ్రామాల నుంచి రైతులు మిర్చిని తీసుకొస్తున్నారు. ప్రధానంగా హైబ్రిడ్‌ రకాలైన ఆర్మూరు, 341, నెంబరు.5, సింజెండా బ్యాడిగి రకాల మిరపకాయలను దేశీయంగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని కారం తయారీకి వినియోగిస్తున్నారు. 355 బ్యాడిగి, తేజ, 273, 334, ఆర్మూరులో ఎక్స్‌పోర్టు క్వాలిటీ రకాలను మాత్రం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం సింగపూరు, ఇండోనేషియా, చైనా, బంగ్లాదేవ్‌, యూఏఈ, శ్రీలంక, థాయ్‌ల్యాండ్‌, మలేషియా తదితర ఆసియా ఖండంలోని దేశాల నుంచి ఆర్డర్స్‌ వస్తున్నాయి. దీంతో ఎక్స్‌పోర్టు క్వాలిటీ రకాలకు నాణ్యతని బట్టి రూ.20 వేల వరకు వ్యాపారులు చెల్లిస్తున్నారు. 355 బ్యాడిగి ఒక్క దానికే డిమాండ్‌ అధికంగా ఉండటంతో దాని ఈ రకం మిర్చికి రూ.25 వేల వరకు కూడా ధర పెడుతున్నారు. గత రెండు వారాల్లో ఎక్కువగా సెలవులు రావడం కూడా మార్కెట్‌ తిరోగమనానికి ఒక కారణమైంది. గత ఏడాది కోటి మిర్చి టిక్కీల వరకు రైతులు కోల్డ్‌స్టోరేజ్‌లలో నిల్వచేసి సీజన్‌ తర్వాత డిమాండ్‌ని బట్టి బయటకు తీసి విక్రయించారు. దాంతో ధర స్థిరంగా నిలిచింది. ఈ సంవత్సరం కూడా అదే పంథాని అనుసరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే 40 లక్షల టిక్కీలు కోల్డ్‌స్టోరేజ్‌లకు చేరినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. రాబోయే మూడు వారాల్లో ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

- Advertisement -

ధరలు మరింత తగ్గే అవకాశం..

గత వారం కంటే కొన్ని వెరైటీలకు ధరలు తగ్గగా, మరికొన్ని వెరైటీల ధరలు నిలకడగా ఉన్నాయి. బుధవారం ధరలను పరిశీలిస్తే 334 రకం కనిష్ట ధర క్వింటాల్‌ రూ.9 వేలు, గరిష్ట ధర రూ.24 వేలు, నెంబరు 5 రకం కనిష్ట ధర రూ.11,500, గరిష్టం రూ.23,500 ధర కాగా, 273 రకం కనిష్టం రూ.10,500, గరిష్టం రూ.22 వేలు, 341 రకం కనిష్టం రూ.10 వేలు, గరిష్టం రూ.24,500, 4884 రకం కనిష్టం రూ.10 వేలు, గరిష్టం రూ.20,500, సూపర్‌ 10 రకం కనిష్టం రూ.18 వేలు, గరిష్టం రూ.22 వేలు ధరలు లభించాయని యార్డు అధికారులు వెల్లడించారు. మేలు రకాలైన తేజ క్వింటాళ్‌ కనిష్టం రూ.9 వేలు, గరిష్టం రూ.24 వేలు, బాడిగ రకం కనిష్టం రూ.11,500, గరిష్టం రూ.27 వేలు, దేవనూరు డీలక్సు కనిష్టం రూ.13 వేలు, గరిష్టం రూ.23,500 లభించాయి. గత వారంలో కంటే పలు వెరయిటీల్లో క్వింటాలుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు తగ్గాయి. ఈ ధరలు మరింత తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు. కారం కోసం వినియోగించే మిర్చి డ్రై అయి ఉండాలని, నాణ్యతగా ఉండాలని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement