న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీని విమర్శించే ముందు నాడు యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ఉద్దేశించి ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ ప్లీనరీలో చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. బీజేపీ అంటే టీఆర్ఎస్ నాయకత్వం భయపడుతోందని, అందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ప్లీనరీ మొత్తం కేసీఆర్ భజన, బీజేపీపై బురదజల్లడంతోనే సరిపోయిందని ఏద్దేవా చేశారు. దేశంలో గుణాత్మక పాలన అవసరమంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. గుణాత్మక పాలన అంటే నిజాం రాజ్యం లాంటి పాలనా? గుణాత్మకమైన పాలన అంటే తండ్రీ కొడుకుల పాలనా? గుణాత్మక పాలన అంటే అప్పులు, అబద్ధాలు, అవినీతి పాలనా? అంటూ కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. దేశంలో మార్పు రావాలంటూ, ఆ మార్పు కల్వకుంట్ల కుటుంబంతోనే వస్తుందన్నట్టుగా టీఆరెస్ నేతలు పూనకం వచ్చినట్టు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడమే కేసీఆర్ కోరుకుంటున్న గుణాత్మక మార్పా అని ప్రశ్నించారు. అప్పులు చేసి మరీ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఫ్రంట్ పెట్టుకోవచ్చు.. టెంట్ వేసుకోవచ్చు
జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న కేసీఆర్ ప్రయత్నాలపై స్పందిస్తూ దేశంలో ఎవరైనా ఫ్రంట్ పెట్టుకోవచ్చు, టెంట్ వేసుకోవచ్చని, అందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా ఆ హక్కు, వెసులుబాటు ఉందని గుర్తుచేశారు. అయితే టీఆర్ఎస్ నాయకులు చెట్ల మీద విస్తారకులు కుడుతున్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ సమాజంలో భారత ప్రతిష్ట మోదీ ప్రధాని అయ్యాకే పెరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. విదేశాల్లోని భారతీయులు గర్వంగా తలెత్తుకుని జీవిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇందుకు తాజా ఉదాహరణ ఉక్రెయిన్ యుద్ధమేనని, ప్రపంచంలో ఏ దేశం చేయని సాహసం భారత్ చేసిందని అన్నారు. యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపి మరీ భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీదేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కళ్ళుండి చూడలేనివాళ్ళు, చెవులుండి వినలేనివాళ్లకు ఏమి చెప్పినా ఉపయోగం లేదని అన్నారు. గల్ఫ్ దేశాల్లోనూ కార్మికులు సగౌరవంగా ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. గల్ఫ్ పాలకులకు, రాజులకు మోదీ అంటే అత్యంత గౌరవమని, అందరూ ఆయన్ను ఓ మిత్రుడిలా చూస్తున్నారని అన్నారు.
కేబినెట్ మీటింగ్‌కే వెళ్లని వ్యక్తి.. ఏం చేస్తారు?
దేశంలో 65 వేల టీఎంసీ నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందన్న కేసీఆర్ వ్యాఖ్యలకు బదులిస్తూ.. నాడు యూపీఏ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏమి ఒలగబెట్టారో చెప్పాలని అన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆఫీస్ కి వెళ్ళేవారు కాదని, మంత్రివర్గ సమావేశాలకు కూడా వెళ్లేవారు కాదని కిషన్ రెడ్డి అన్నారు. వృధా అయ్యే నీటి విషయంలో నాడు కేంద్రం మంత్రిగా ఏమి చేశారో చెప్పాలని అన్నారు. వృధా అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం చేపట్టిందని, కానీ కేసీఆర్ ఇల్లెక్కి గగ్గోలుపెడుతూ అనుసంధానాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
భారత్‌లోనే చమురు ధరలు తక్కువ
ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అనేక దేశాలతో పోల్చితే భారత్ లో పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువని తెలిపారు. ప్రజలపై పన్ను భారం తగ్గించడం కోసం కేంద్రం పన్ను రేట్లను తగ్గించిందని, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా రాష్ట్ర పన్నుల రేటు తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు మాత్రం తగ్గించలేదని అన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయని, రాష్ట్ర పన్నులు ఎందుకు తగ్గించడం లేదో చెప్పాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా రాకపోతే, అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనమే తప్ప తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదని అన్నారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో మొదటి 10 గ్రామాలు తెలంగాణలోనే ఉండడం అందరం గర్వించాల్సిన విషయమని, దాన్ని రాజకీయం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జాబితాలో తాను దత్తత తీసుకున్న గుమ్మడివెల్లి గ్రామం దేశంలో 2వ ఉత్తమ ఆదర్శ గ్రామంగా నిలిచిందని, కానీ మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో ఆ పేరు పలకడానికి, రాయడానికి కూడా ఇష్టపడలేదని అన్నారు.
ప్లీనరీలో కాంగ్రెస్ మాట లేదు
ప్లీనరీలో కేసీఆర్‌ను పొగడడం, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప మరేమీ లేదని చెప్పిన కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తుచేశారు. దీని వెనుక ఆంతర్యమేంటో తాను చెప్పాల్సిన అవసరం లేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..