న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి అర్థాంతరంగా తనువు చాలిస్తున్న భారత విద్యార్థుల ఘటనలు ఆందోళన కల్గిస్తున్నాయి. గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 403 మంది భారత విద్యార్థులు విదేశాల్లో ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డా. సుబ్రహ్మణ్యం జైశంకర్ ఇచ్చిన సమాధానంలో ఈ విషయం స్పష్టం చేశారు.
2018 నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాల్లో వివిధ కారణాలతో చనిపోయిన భారత విద్యార్థులు 403 మంది అని, వారిలో అత్యధికంగా కెనడా 91 మంది మృత్యువాత పడ్డారని వెల్లడించారు. ఆ తర్వాతి స్థానాల్లో యూకే (48), రష్యా (40), యుఎస్ఏ (36), ఆస్ట్రేలియా (35) దేశాలున్నాయి. విదేశాల్లో చదువుకుంటున్న భారత విద్యార్థుల మరణాలు, విద్యార్థుల సంక్షేమం కోసం విదేశాంగ శాఖ చేపట్టిన చర్యల గురించి గల్లా జయదేవ్ ప్రశ్నించారు.
వాటికి సమాధానమిస్తూ.. విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంక్షేమం తమ మొట్టమొదటి ప్రాధాన్యతగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే భారత విద్యార్థులు సమీప భారత ఎంబసీలు, కాన్సులేట్లలో రిజిస్టర్ చేసుకోవాలని సూచిస్తున్నట్టు తెలిపారు. తద్వారా ఆ విద్యార్థులతో భారత రాయబార కార్యాలయం తరచుగా సంప్రదిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటుందని చెప్పారు.
మరోవైపు భారత విద్యార్థులు చదువుకుంటున్న యూనివర్సిటీల యాజమాన్యం, ఆయా దేశాల్లోని భారత సంతతి సమూహాలను ఏంబసీ ఉన్నతాధికారులు తరచుగా కలుస్తున్నారని, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. అలాగే స్థానిక ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి అవసరమైన సహాయ సహకారాలు కూడా అందజేస్తున్నట్టు వెల్లడించారు.
అలాగే విద్యార్థుల తమ సమస్యలు, ఇబ్బందుల గురించి ఫిర్యాదు చేసేందుకు ‘మదద్’ పేరుతో ఒక పోర్టల్ కూడా ఏర్పాటు చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఫోన్ కాల్, ఈ-మెయిల్, సోషల్ మీడియా లేదా నేరుగా వాక్-ఇన్ విధానాల్లో విద్యార్థులు తమను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
అలాగే విద్యార్థులు చదువుకుంటున్న దేశాల్లో సంక్షోభాలు, విపత్తులు, యుద్ధాలు సంభవించినప్పుడు వారిని భారత్‌కు సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఎయిర్‌లిఫ్ట్ రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టినట్టు మంత్రి జైశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’, ‘ఆపరేషన్ అజయ్’ వంటి ఆపరేషన్ల గురించి ఆయన ప్రస్తావించారు. ఇలాంటి ఆపరేషన్ల ద్వారా గత మూడేళ్లలో మొత్తం 23,906 మంది భారతీయ విద్యార్థులను సంక్షోభ ప్రాంతాల నుంచి భారత్‌కు తరలించామని చెప్పారు.