Saturday, November 23, 2024

Big story | కృత్రిమ నూనెతో కాటికే.. ట్రాన్స్‌ ఫ్యాట్‌తో రోజురోజుకూ పెరుగుతున్న మరణాలు

అమరావతి, ఆంధ్రప్రభ రుచి కోసమో.. టైం పాస్‌ కోసమో కొంటున్న ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌, బయటి ఆహారపదార్థాలు మన కొంప ముంచుతున్నాయి. వాటిని తయారుచేసే సమయంలో కక్కుర్తిపడి సరైన వంట నూనెను వాడకపోవటం వల్ల కొంప కొల్లేరవుతోంది. ముఖ్యంగా ట్రాన్స్‌ ఫ్యాట్‌ ఏటా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోది. ‘వనస్పతి’గా పిలిచే ఈపారిశ్రామికంగా తయారు చేసే నూనె లేదా కొవ్వు వల్ల మన దేశంలో నిమిషానికి ఒకరు మరణిస్తున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈవిషయాన్ని స్వయంగా ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌, ఇతర అధ్యయన సంస్థలే తేల్చిచెప్పాయి. కేంద్ర ప్రభుత్వం స్వయంగా లోక్‌ సభలో గత నెల 11న ఈ వివరాలను కూడా వెల్లడించడం గమనార్హం.

ఏమిటీ ట్రాన్స్‌ ఫ్యాట్‌

ట్రాన్స్‌ ఫ్యాట్‌ అనేది ఒక అసంతృప్త కొవ్వు ఆవ్లుం. ఇది రెండు రకాలుగా తయారవుతుంది. 1) సహజ 2) కృత్రిమ అనే రూపంలో ఇది ఉంటుంది. మనం తినే మాంసాహారాల్లో, అవులు, గేదెలు, గొర్రెల నుంచి సేకరించే పాలు, పాల ఉత్పత్తుల్లో ట్రాన్స్‌ఫ్యాల్‌ ఉంటుంది. అయితే ఇది సహజంగా తయారవడంతోపాటు, చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి పెద్దగా ప్రమాదం ఉండదు.

కానీ, పారిశ్రామికంగా ఎడిబుల్‌ ఆయిల్స్‌ను రసాయన ప్రక్రియ ద్వారా ట్రాన్స్‌ఫ్యాట్‌గా మార్చుతుంటారు. దీనిని క్లుప్తంగా కృత్రిమ నూనె అని అంటాం. సాధారణ వాడుక భాషలో దీనిని వనస్పతి అని పిలుస్తుంటారు. దీనిని నూనెలా ద్రవ రూపంలో, ఘన రూపంలో తయారు చేస్తుంటారు. ట్రాన్స్‌ఫ్యాట్‌ మన శరీరంలోకి వెళ్లిన తర్వాత మన జీవక్రియ రేటుపై ప్రభావం చూపిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి.

- Advertisement -

దీంతో శరీరంలోని అవయవాల పనితీరు మందగిస్తుందని, క్రమంగా అవి విఫలం అవుతాయని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా నిర్వహించిన అధ్యయనాల్లో గుండె సమస్యలకు ట్రాన్స్‌ఫ్యాట్‌ కారణమని తేలింది. ట్రాన్స్‌ ఫ్యాట్‌ శరీరంలోకి వెళ్లిన తర్వాత ధమనుల గోడలపై పేరుకుపోయి మూసివేస్తున్నదని తేలింది. ట్రాన్స్‌ ఫ్యాట్‌ వల్ల అనారోగ్య సమస్యతో మరణం సంభవించే ప్రమాదం 84 శాతం పెరుగుతుంది. గుండె సమస్యలు మొదలై మరణించే అవకాశం 28 శాతం పెరుగుతుంది.

ఎక్కడ, ఎందుకు వాడుతారు?

ట్రాన్సఫ్యాట్‌ను ఎక్కువగా ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌, బిస్కెట్లు, కేకులు, రస్కులు వంటి ప్యాకేజ్డ్‌ బేకరీ ఆహారపరార్ధాలు, ఫ్రై చేసిన ఆహార పదార్థాల తయారీకి వాడుతుంటారు. ట్రాన్స్‌ఫ్యాట్‌ చౌకగా తయారవుతుంది. కాబ్బటి నెయ్యి, వెన్న వంటి పాల ఉత్పత్తులకు బదులుగా వీటిని వాడుతుంటారు. సహజమైనవాటితో పోల్చితే ట్రాన్స్‌ ఫ్యాట్‌తో తయారు చేసిన ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. రుచి కూడా మారదు. మనం ఇంట్లో అయినా, బయట. హోటళ్లలో అయినా నూనెను ఒకటికంటే ఎక్కువసార్లు వేడి చేసినా ఈ ట్రాన్స్‌ ఫ్యాటీ ఆవ్లూలు తయారవుతాయని నిపుణులు చెప్తున్నారు.

నిమిషానికి ఒకరు మృతి

ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 5.40 లక్షల మరణాలు నమోదవుతున్నాయి. అంటే ప్రతి నిమిషానికి దాదాపు ఒకరు ఈ కృత్రిమ నూనెలకు బలవుతున్నారని స్పష్టమౌతోంది. మన దేశంలో వెలుగుచూస్తున్న గుండె సంబంధిత మరణాల్లో 4.8 శాతం ట్రాన్స్‌ ఫ్యాట్‌ వల్లే జరుగుతున్నాయని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ట్రాన్స్‌ ఫ్యాట్‌ వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నేపట్టింది. ఫుడ్‌ సేప్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో కలిసి ‘ఈట్‌ రైట్‌ ఇండియా’ పేరుతో ఎలాంటి ఆహారం తీసుకోవాలో ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా కృత్రిమ నూనెలపై అవగాహన కల్పిస్తోంది. ట్రాన్స్‌ ఫ్యాట్‌కు దూరంగా ఉండేందుకు పలు సూచనలు చేసింది.

వనస్పతిని వండటం మానేయాలి.

పూరీ, పకోడీ వంటి డీప్‌ ఫ్రై వంటకాలు చేసే సమయంలో నూనెను ఎక్కువ సేపు వేడి చేయవద్దు. ఆనూనెలో ఎక్కువ సేపు ఆహార పదార్ధాలను ఉంచకూడదు. ఒకసారి వేడి చేయడానికి వాడిన నెను తిరిగి మరోసారి ఫ్రై చేయడానికి వాడకూడదు. అయితే ఆనూనెను కూరలు చేయడానికి వాడుకోవచ్చు. ఇంట్లో డీప్‌ ఫ్రై చేసే సమయంలో కడాయి వంటి చిన్న పాత్రలను మాత్రమే వినియోగించాలి. బయటి నుంచి తెచ్చుకునే భిస్కట్లు, కేకులు, చిప్స్‌, చిరుతిండ్లు, ఇతర ఫ్రై చేసిన పదార్ధాలను, ప్యాక్‌డ్‌ ఫుడ్స్‌ను తగ్గించాలి.

నూనెలు కొనేప్పుడు జాగ్రత్త

దుకాణానికి వెళ్లి నూనె కొనుగోలు చేసే సమయంలో దానిపై ఉండే న్యూట్రిషన్‌ ప్యాక్‌ పట్టికను జాగ్రత్తగా గమనించాలి. ఇందులో ట్రాన్స్‌ ఫ్యాటీ యాసిడ్‌ లేదా టీఎన్‌ఏ లేదా ట్రాన్స్‌ ఫ్యాట్‌ ఎంత శాతం ఉందో కచ్చితంగా చూడాలి. 0.2 గ్రాముల కన్నా ఎక్కువ ఉంటే. దానిని వాడకపోవడం మంచింది. కొన్నిసార్లు ఉత్పత్తులపై టీఎన్‌ఏ అని నేరుగా రాయకుండా షార్టినింగ్‌, పార్షియల్లీ హైడ్రోజినేటెడ్‌ వెజిటేబుల్‌ ఆయిల్‌ అని వాడుతుంటారు.

ఇలాంటివి ప్రమాదకరమని ఫుడ్‌ సేప్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చెబుతోంది బయటి నుంచి ఆహార పదార్థాలు తెప్పించుకునే సమయంలో వాడుతున్న నూనెల గురించి అడగాలి. వనస్పతితో చేసిన ఆహార పదార్థాలను తినడం మానేయాలి. ఫ్రెంచ్‌ ప్రెస్‌, సమోసా అలూచాట్‌ వంటి వాణిజ్యపరంగా తయారు చేసే ఉత్పత్తులను తినడం తగ్గించాలి. కుకీస్‌, చిప్స్‌, కేక్స్‌ వంటి బేస్డ్‌ ఫుడ్ను తగ్గించాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement