హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ ఘటనలో పలువురు చిన్నారులు గాయపడ్డారు. కనీనా పట్టణం సమీపంలోని కనీనా- దాద్రి రోడ్డులో ఈరోజు ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ బస్సు కనీనాలోని జిఎల్ పబ్లిక్ స్కూల్‌కు చెందినదిగా గుర్తించారు. విద్యార్థులతో వెళుతున్న ఈ బస్సు ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందగా, 20మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులను రోహ్తక్ పీజీఐకి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు మృతి చెందారు. పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, పలు ప్రైవేట్ పాఠశాలలను తెరిచారు. ఇదే కోవలో జీఎల్ పబ్లిక్ స్కూల్‌కు కూడా సెలవు ఇవ్వలేదు.
డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం మహేంద్రగఢ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.