Friday, November 22, 2024

50వేలు దాటిన టర్కీ, సిరియా భూకంప మృతులు..

ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం మృతుల సంఖ్య 50,000 మార్క్‌ను దాటింది. భూకంపంలో భవనాలు కూలడంపై ప్రభుత్వం బాధ్యులుగా అనుమానిస్తూ 184 మందిని ఇప్పటి వరకూ అరెస్టు చేసింది. అక్రమ పద్ధతులలో నిర్మాణాలు చేపట్టడం వలన భవనాలు మరింత కూలిపోయాయని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి. టర్కీలో భూకంప మృతుల సంఖ్య 44,128 కు చేరుకుంది. సిరియాలో 5,800 మంది మరణించారు. ఈ ఘోర విపత్తు కారణంగా టర్కీలో 5,20,000 అపార్ట్‌మెంట్లను కలిగి ఉన్న భవనాలు 1,60,000 కంటే ఎక్కువ భవనాలు కూలిపోవడమో, లేదా తీవ్రంగా దెబ్బతినడమో జరిగింది.

అక్రమ, నాసిరకం నిర్మాణాలు కూలిపోవడంపై ఇప్పటి వరకు ప్రభుత్వం 600 మందికి పైగా వ్యక్తులను విచారించామని. ఆగ్నేయ నగరమైన దియార్‌బాకిర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ న్యాయశాఖమంత్రి బెకిర్‌ బోజ్‌డాగ్‌ అన్నారు. ఈ ప్రాంతం విపత్తు బారిన పడిన 10 ప్రావిన్సుల్లో ఒకటి. అవినీతి కరమైన భవన నిర్మాణ పద్ధతులు, లోపభూయిష్ట పట్టణ అభివృద్ధిపై పలువురు టర్క్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జూన్‌లో ఎన్నికలను ఎదుర్కోనున్న అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌కు భూకంపం నేపథ్యంలో పలు సవాళ్లును ఎదురవుతున్నాయి. ఇది ఎర్డోగాన్‌ అత్యంత కఠీన పరీక్షలాంటిదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. విపత్తు కారణంగా నిరాశ్రయులైన దాదాపు రెండు మిలియన్ల మంది ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గుడారాలు, కంటైనర్లులో నివాసం ఉంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement