Saturday, November 23, 2024

సూర్యుడికీ మరణం! నిర్ధారించిన‌ ఖగోళ శాస్త్రవేత్తల..

సమస్త జీవరాశికి ప్రాణాధారమైన సూర్యుడూ ఏదో ఒక రోజు నిర్వీర్యమైపోతాడని, దానికి సంబంధించిన సంకేతాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యుడి అంతిమ ఘడియలు ఎప్పుడన్నదానిపై ఓ అంచనాకొచ్చారు. సూర్యుడి మనుగడ, అంతర్థానంపై సాధికారికంగా ఓ అభిప్రాయానికి రావడం ఇదే తొలిసారి. భవిష్యత్‌లో ఇప్పటికైనా పెద్ద సైజులో.. ఓ ఎర్రని బుడగలా సూర్యుడు మిగిలిపోతాడని వారు భావిస్తారు. ఇది ఇప్పటికిప్పుడు జరిగే పరిణామం కాదు. కానీ వేల కోట్ల సంవత్సరాల తరువాతైనా జరుగుతుందన్నది తాజా అధ్యయనంలో తేలిన అంశం. ప్రస్తుతం 4.57 బిలియన్‌ సంవత్సరాల నడి వయసులో ఉన్న సూర్యుడు, తొలిసారిగా మనుగడకు సంబంధించిన సంకటాలను ఎదుర్కొంటున్నాడని వారు నిర్ధారించారు. దాదాపు మరో వెయ్యి బిలియన్‌ సంవత్సరాల తరువాత మన సూర్యుడు ఇక ఉండడన్నది వారి అంచనా. ఇదే విషయాన్ని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకూడా చెబుతోంది.

సూర్యగోళంలో నిరంతరం అగ్నిజ్వాలలు ఎగసిపడుతూంటాయి. సౌర తుఫానులు, సౌర అయస్కాంత క్షేత్రంలో విస్ఫోటనాలు ప్రజ్వరిల్లుతూంటాయి. లక్షల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలతో భగభగలాడే సూర్యుడిలో ఈ తరహా వాతావరణానికి కారణం అందులో సుడులు తిరిగే హైడ్రోజన్‌ వాయువులు. ఆ వాయువులు హీలియంగా మారి మంటలకు కారణమవుతూంటుంది. సూర్యుడి కేంద్రకంలోను, కొరోనాగా పిలిచే ప్రాంతంలోనూ ఈ హైడ్రోజన్‌ వాయువుల పరిమాణం.. రానురాను తగ్గిపోతూండటమే ఆ గ్రహం మనుగడపై సందేహాలకు కారణం. సూర్యుడిలో కీలకమైన హైడ్రోజన్‌ వాయువుల పరిమాణం గణనీయంగా తగ్గిపోవడాన్ని తొలిసారిగా గుర్తించారు. ఈ విశ్వం గురించి సాధికారిక, కచ్చితత్వంతో కూడిన మ్యాప్‌లను రూపొందించడానికి కారణమైన గాయియా అంతరిక్ష నౌక అందించిన తాజా సమాచారం ఆధారంగా సూర్యుడి ఆవిర్భావం, అంతిమ ఘడియలపై ఖగోళ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. సౌరమండలంలో రారాజైన సూర్యుడి మనుగడపైనే భూగోళంపై జీవరాశి భవిష్యత్‌ ఆధారపడి ఉంది.

గుట్టు విప్పిన గాయియా స్పేస్‌క్రాఫ్ట్‌

అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న గాయియా స్పేస్‌క్రాఫ్ట్‌ ఇప్పటివరకు ఎంతో కీలక సమాచారం అందించింది. విశ్వంలోని గ్రహాలు, ఉపగ్రహాలు, వేల కోట్ల నక్షత్రాలు, వాటి ఉష్ణశక్తి, కాంతి, వాటి పరిమాణం, ప్రభావం వంటి అంశాలపై సమస్య సమచారాన్ని అందించింది. ఈ ఏడాది జూన్‌లో పంపిన సమాచారం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఇన్నాళ్లూ సౌరమండలంలోని ఇతర నక్షత్ర సమూహం, గ్రహాల గురించి గుట్టు విప్పిన గాయియా ఇప్పుడు ఏకంగా సూర్యుడి గురించి కీలక సమాచారాన్ని అందించింది. సూర్యుడిలో ఉన్నట్లే నక్షత్రాల్లోనూ సంక్షిష్ట వాతావరణం, ద్రవ్యరాశి, ధూళివంటి పదార్థాలు ఉన్నాయని, కాలానుగుణంగా పరిణామక్రమంలో అవి నిర్వీర్యమవుతున్నట్లే సూర్యుడిలోనూ మార్పులు తథ్యమని గుర్తించారు.

సూర్యుడి వయసెంత?

- Advertisement -

ఖగోళ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సూర్యుడి వయసు 4.57 బిలియన్‌ సంవత్సరాలు. వారి లెక్కల ప్రకారం సూర్యుడు నడివయసులో ఉన్నాడు. హైడ్రోజన్‌ వాయువులు హీలియమ్‌గా మారి జ్వాలలు ఎగసిపడడం సూర్యగ్రహంలో నితంతర ప్రక్రియ. అయితే, గతానికన్నా భిన్నాంగా గతవారం సూర్యుడిలో అనూహ్యమైన మార్పులు కన్పించాయి. ఎన్నడూ లేనివిధంగా సూర్యుడిలో ఏకంగా 17 కొరోనల్‌ విస్ఫోటనాలు సంభవించాయి. అయస్కాంత క్షేత్రంలో 9 ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరిగి బిలాల్లాంటివి ఏర్పడ్డాయి. ఇది అసాధారణ చర్య. ఇలాంటి చర్యలు విస్తృతమయ్యేకొద్దీ హైడ్రోజన్‌/హీలియం వాయువుల వినియోగం అధికమై వాటి పరిమాణం తగ్గిపోతుంది. ఫలితంగా సూర్యుడి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతాయి. చివరకు ఉపరితల ఉష్ణోగ్రతలు పతనమై ఓ ఎర్రని గాలి బుడగలా సూరీడు మిగిలిపోతాడు. అయితే, ఈ మార్పులకు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టొచ్చు.

ఏం జరగబోతోంది?

సాధారణంగా ఓ నక్షత్రంలో ఉండే పదార్థాలు ఏమిటి, వాటి వాతావరణంలో ఉండే రసాయనిక సమీకరణలు, వాటి మరణానికి (నిర్వీర్యం) కారణాలేంటి అనేది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు తహతహలాడుతున్నారు. వారి అన్వేషణలకు గాయియా అందించిన సమాచారం చాలా ఉపయుక్తంగా మారింది. ఫ్రాన్స్‌ లోని డి ల కోటో డిఅజుర్‌ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్త ఓర్‌లాఘ్‌ క్రీవరీ ఈ విషయంపై అధ్యయనం చేశారు. గాయియా అందించిన సమాచారం ప్రకారం నక్షత్రాల్లో ఉష్ణోగ్రతలు కనీసం 3000కె నుంచి 10,000కె వరకు ఉన్నాయి. మన పాలపుంతలో కొన్ని వేల సంవత్సరాలుగా జ్వలిస్తున్న నక్షత్రాలున్నాయని గాయియా గుర్తించింది. సరిగ్గా అలాంటి వాతావరణమే సూర్యుడిలోనూ ఉంది. కాకపోతే ఇక్కడ మరింత ఎక్కువగా అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంది. ప్రసుత్తం సూర్యుడి వయసు 4.5 బిలియన్‌ సంవత్సరాలు. 8 బిలియన్‌ సంవత్సరాల నాటికి అత్యధిక ఉష్ణోగ్రతలతో భగభగలాడుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా చల్లబడుతూ వస్తుంది. చివరకు 1011 బిలియన్‌ సంవత్సరాల తరువాత పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఆ స్థితిలో సూర్యుడి సైజు బాగా పెరిగి ఓ ఎర్రని బంతిలా మారిపోతుందని ఓర్లాఘ్‌ ఓ ప్రకటనలో వివరించారు. ఇదే విషయాన్ని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ సూర్యుడి మరణం ఖాయమని స్పష్టం చేసింది. సూర్యుడు నిర్వీర్యమైనాక పాలిపోయిన రంగులో కన్పిస్తాడని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement