కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థిని తొర్రం వెంకటలక్ష్మి (19) మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వెంకటలక్ష్మి అస్వస్థతకు గురైన విషయాన్ని హాస్టల్ అధికారులు తమకు సమాచారం అందించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి… విద్యార్థిని మృతికి కారణమైన హాస్టల్ అధికారిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్ అధికారి నిఖత్ తరన్నును విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం అందుగులపల్లికి గ్రామానికి చెందిన తొర్రం వెంకటలక్ష్మి ఆసిఫాబాద్‌లోని శ్రీనిధి కళాశాలలో డీఈడీ చదువుతోంది. స్థానిక బీసీ పోస్టు మెట్రిక్ హాస్టల్‌లో అడ్మిషన్ తీసుకుంది.
డీఈడీ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ఉండడంతో వారం రోజుల క్రితం హాస్టల్‌కు వచ్చింది. అయితే హాస్టల్లో ఫుడ్ నచ్చకపోవడంతో బయటి నుంచి ఎక్కువగా పండ్లు తెచ్చుకునేది..
అయితే, శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆమె ఒక్కసారిగా తలనొప్పితో కిందపడిపోయింది. దీంతో వెంకటలక్ష్మిని 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.