న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు, నేతలు మారినా తమ తలరాతలు మారడం లేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని తాల్‌కటోరా స్టేడియంలో బుధవారం జరిగిన ఆలిండియా రేషన్ డీలర్ల సదస్సులో డీలర్లు తమ దీర్ఘకాలిస సమస్యల గురించి మాట్లాడారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నుంచి డీలర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేశంలో ఉన్న 120 కోట్ల మంది ప్రజలకు ఆహార ధాన్యాలు, సరుకులు అందజేస్తున్నామని, అయితే ప్రభుత్వం తమకు అందించే సబ్సిడీ కుటుంబ జీవనానికి సరిపోవడం లేదని అన్నారు.
ఇతర దేశాలకు ఉదారంగా సహాయం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రభుత్వం కోసం పనిచేస్తున్న డీలర్లపై చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజలకు చేరువయ్యే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ప్రజా పంపిణీ వ్యవస్థేనని అన్నారు. తమ పనికి తగ్గ వేతనం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. నెల జీతం కింద రూ. 50 వేలు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే 2024 జనవరి 16 నుంచి ఆలిండియా డీలర్ల సంఘం దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపడుతుందని హెచ్చరించారు.
డోర్ డెలివరీతో సమస్యలే
ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తూ అమలు చేస్తున్న రేషన్ డోర్ డెలివరీ పథకం మంచిదే అయినప్పటికీ తమ హక్కులు కాలరాస్తూ పొట్టగొడుతోందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రేషన్ డీలర్ల నేతలు తెలిపారు. జాతీయాధ్యక్షులు కంచం కృష్ణమూర్తి గుప్త, ఏపీ ప్రధాన కార్యదర్శి మునగ గిరిజా రావు మీడియాతో మాట్లాడుతూ డోర్ డెలివరీ పథకం కేవలం కొందరికి మాత్రమే అనుకూలంగా ఉందని అన్నారు. వాహనం ద్వారా రేషన్ తీసుకొచ్చిన సమయంలో చాలామంది అందుబాటులో ఉండడం లేదని, సరుకు తీసుకోలేకపోతున్నారని చెప్పారు. రేషన్ వాహనం కారణంగా ఇబ్బందులే తప్ప లాభాలు లేవని పెదవి విరిచారు. ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్లకు నాలుగు రోజులు రేషన్ అందించే అధికారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.