జోహాన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని సెంట్రల్ జోహాన్స్‌బర్గ్‌లో గురువారం ఐదంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో చిన్నారులు సహా 73 మందికి పైగా మరణించారు. మరో 52 మంది గాయపడ్డారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా నగరంలోని అత్యవసర సేవల విభాగం తెలిపింది. కొందరు పొగ పీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వీరందరిని స్థానిక ఆసుపత్రులకు చికిత్స కోసం తీసుకువెళ్లినట్లు ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రతినిధి రాబర్ట్ ములాడ్జీ తెలిపారు. మృతుల్లో కనీసంగా ఏడుగురు చిన్నారులు ఉన్నారు.
ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదాల్లో ఇదొకటి. మృతుల్లో రెండేళ్ల చిన్నారి ఉందని, ఆమె శరీర భాగాలు గుర్తించలేనంతగా కాలిపోయాయని రాబర్ట్ ములాడ్జీ వెల్లడించారు. ”జోహాన్స్‌బర్గ్ నగరానికి ఇది నిజంగా విచారకరమైన రోజు… 20 ఏళ్లపాటు సేవలో ఉన్నా, నేను ఇలాంటివి ఎన్నడూ చూడలేదు,” అని ములాద్జీ చెప్పారు. అగ్నిప్రమాద కారణాలు తెలియరాలేదు.
అర్ధరాత్రి దాటాక అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసు కోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. నిరాశ్రయులు ఎలాంటి లీజ్ అగ్రిమెంట్లు లేకుండానే నివాసం ఉంటున్నారని ఎమర్జెన్సీ అధికారులు తెలిపారు. అందువల్ల భవనంలో చిక్కుకుపోయిన వారిని వెతకడం కష్టంగా మారిందన్నారు. భవనంలో దాదాపు 200 మంది నివాసముంటున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది టాంజానియా వాసులేనని తెలుస్తోంది. మంటల ధాటికి భవనం చాలా వరకు ధ్వంసమైంది.
అంతా శరణార్థులే..
సాధారణంగా ఈ నగరంలోని చాలా ప్రాంతాల్లో అనేక భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఇందులో చాలా వరకు క్రిమినల్ సిండికేట్ల అధీనంలో ఉన్నాయి. వీరంతా ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థుల నుంచి అద్దెలు తీసుకుంటూ వారిని అక్రమంగా ఈ భవనాల్లో ఉండేందుకు అనుమతిస్తున్నారు. తాజాగా ప్రమాదం జరిగిన భవనంలోనూ అలాంటి శరణార్థులే ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
సెక్యూరిటీ గేట్‌కు తాళం వేయడంతో..
ఇక, ప్రమాదం జరిగిన భవనంలో ఓ సెక్యూరిటీ గేట్ ఉంది. ఆ గేట్‌కు తాళం వేసి ఉంది. దీంతో మంటలు చెలరేగిన సమయంలో అందులో చిక్కుకున్న వారంతా వెంటనే బయటకు రాలేకపోయారని అధికారులు తెలిపారు. సహాయక చర్యల సమయంలో ఆ గేట్‌ను బద్దలుకొట్టగా.. దాని వెనుక అనేక కాలిన మృతదేహాలు కన్పించడం ఈ విషాదాన్ని అద్దం పడుతోంది.
ప్రమాదానికి కారణమదేనా..?
ఈ భవనంలో దాదాపు 80 వరకు చిన్న చిన్న గుడిసెల్లాంటి నిర్మాణాలున్నాయి. వీరిలో దాదాపు 200 మంది వరకు నివసిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. శరణార్థులు ఇలా భవనాల్లో అక్రమంగా నివసిస్తూ ప్రమాదంలో పడకుండా ఉండేందుకే.. ఇక్కడి మున్సిపాలిటీ నిరుపయోగంగా వదిలేసిన భవనాలకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేసింది. అయినప్పటికీ శరణార్థులు అక్కడే జీవనాలు సాగిస్తున్నారు.
కొవ్వత్తుల వెలుతురులో, చిన్న చిన్న పారాఫిన్ స్టవ్‌లపై వంట చేసుకుంటూ నివాసముంటున్నారు. కొందరైతే కట్టెల పొయ్యిలు కూడా ఉపయోగి స్తున్నారు. అన్ని వైపులా మూసి ఉండే ఇలాంటి భవనాల్లో పొయ్యిలు వినియోగించడం ప్రమాదకరం. తాజా అగ్నిప్రమాదం కూడా దానివల్లే జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.