కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన 45మంది భారతీయుల మృతదేహాలను శుక్రవారం ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. వైమానిక దళానికి చెందిన విమానం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. మృతదేహాలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో సహా వారి స్వస్థలాలకు తరలిస్తారు. అనంతరం ఇతర రాష్ట్రాల బాధితుల మృతదేహాలతో విమానం ఢిల్లీకి బయలుదేరుతుంది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర మంత్రులు నివాళులర్పించేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. మృతదేహాలను తరలించడానికి ఆంబులెన్స్‌లను కేరళ ప్రభుత్వం సిద్ధం చేసింది. మృతదేహాలను బంధువులకు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బాధితుల్లో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఏపీకి చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.
కువైట్‌లోని మంగఫ్ నగరంలోని ఆరు అంతస్తుల భవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించి 48 మంది కార్మికులు మృతి చెందగా, వారిలో 45 మంది భారతీయులు ఉన్నారు. ఇటీవల విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీ కీర్తి వర్ధన్ సింగ్, ప్రధాని ఆదేశాల మేరకు ప్రమాదం జరిగిన తర్వాత హుటాహుటిన కువైట్‌కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.