Tuesday, November 19, 2024

దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తిపై నియంత్రణ ఎత్తివేత, పీఏసీఎస్ కంప్యూటరీకరణ.. కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశీయంగా క్రూడాయిల్ ఉత్పత్తిపై నియంత్రణ ఎత్తివేస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సీసీఈఏ) దేశీయంగా ఉత్పత్తి చేసిన చమురును ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ రంగ సంస్థలకే విక్రయించాలన్న నిబంధనను ఎత్తివేసింది. చమురును అన్వేషించి ఉత్పత్తి చేసిన కంపెనీలు దేశీయంగా ఎక్కడైనా క్రూడ్ అమ్ముకునే వెసులుబాటు కల్పించింది.

దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రాయల్టీ, సెస్ ఏకరీతిన కొనసాగుతుంది. క్రూడాయిల్ ఉత్పత్తిపై నియంత్రణను ఎత్తివేయడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయి. అప్ స్ట్రీమ్ ఆయిల్, గ్యాస్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. దేశీయ అవసరాల్లో 85% దిగుమతులపై ఆధారపడ్డామని, కేవలం 15% మాత్రమే దేశీయంగా ఉత్పత్తి జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రానున్న రోజుల్లో దిగుమతుల భారాన్ని తగ్గించుకుని, దేశీయంగా క్రూడ్ ఉత్పత్తి పెంచుకోవడం, ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు. గడిచిన ఎనిమిదేళ్లలో ఉత్పత్తి, రీసెర్చ్ రంగంలో కేంద్రం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. దేశీయంగా ఉత్పత్తి చేసిన చమురు ఎగుమతిపై నిషేధం మాత్రం కొనసాగనుంది.

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) సామర్థ్యాన్ని పెంచడం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కంప్యూటీకరణ పథకానికి కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. రూ. 2,516 కోట్ల బడ్జెట్ అంచనాలతో పనిచేస్తున్న 63,000 పీఏసీఎస్‌ల కంప్యూటీకరణ చేయనున్నారు. ఇందులో రూ. 1,528 కోట్లను కేంద్రం తన వాటాగా సమకూరుస్తుంది. ప్రభుత్వ నిర్ణయంతో పీఏసీఎస్‌లలో సభ్యులుగా ఉన్న దాదాపు 13 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. వీరిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు రైతులే. పారదర్శకత, సామర్థ్యం, విశ్వసనీయతను పెంపొందించి పంచాయతీ స్థాయిలో నోడల్ డెలివరీ సర్వీస్ పాయింట్‌గా మారేందుకు పీఏసీఎస్‌లకు అవకాశం లభించింది.

క్లౌడ్ ఆధారిత యూనిఫైడ్ సాఫ్ట్‌వేర్ల సహాయంతో డేటా స్టోరేజీ, సైబర్ సెక్యూరిటీ, హార్డ్‌వేర్, ఇప్పటికే ఉన్న రికార్డుల డిజిటలైజేషన్, నిర్వహణ, శిక్షణ ప్రధాన భాగాలుగా కార్యక్రమాన్ని అమలు చేస్తారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. . దేశంలోని అన్ని సంస్థలు అందిస్తున్న కేసీసీ రుణాలలో పీఏసీఎస్ వాటా 41 శాతంగా ఉంది. కంప్యూటీకరణ వల్ల ఆర్థిక సమగ్రత కల్పించడంతో పాటు రైతులకు, ప్రత్యేకించి చిన్న సన్నకారు రైతులకు అందిస్తున్న వివిధ సేవలు, ఎరువులు, విత్తనాలు వంటి వాటి వివరాలను త్వరితగతిన అందించడానికి వీలు కలుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement