అబిడ్స్‌లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఇందిరా వసంత రెండు రోజుల క్రితం జీఎస్టీ పెండింగ్‌లో ఉందంటూ నారాయణగూడ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి నోటీసులిచ్చింది. నోటీసులపై వివరణ ఇచ్చేందుకు సదరు వ్యాపారి జీఎస్టీకి సంబంధించిన పత్రాలను తీసుకుని అధికారిని కలిశాడు.
అయితే జీఎస్టీ చెల్లింపుతో పాటు భవిష్యత్తులో తన వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇందిరా వసంత 50వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో సదరు వ్యాపారి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో అబిడ్స్ లోని కార్యాలయంలో ఇందిరా వసంత 35 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారిణి ఇందిరా వసంతపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు డీఎస్పీ కె. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.