Friday, November 22, 2024

మూన్‌లైటింగ్‌పై రోజుకో మలుపు.. ఉద్యోగులను తీసివేసే ప్రయత్నాల్లో ఐటీ కంపెనీలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఐటీ రంగంలో తలెత్తిన మూన్‌లైటింగ్‌ (ఉద్యోగి ఒక కంపెనీకి తెలియకుండా మరో కంపెనీలో పని చేయడం) వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. కొన్ని కంపెనీలు ఈ వివాదానికి పూర్తి కారణం ఉద్యోగులే అని ఆరోపిస్తుండగా మరికొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులకు వేతనాలు సరిగా ఇవ్వని కొన్ని కంపెనీలదే ఈ తప్పని చెబుతున్నాయి. మూన్‌ లైటింగ్‌కు పాల్పడ్డరన్న కారణంతో కొన్ని వేల మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తీసివేసేందుకు రంగం సిద్ధం చేసింది. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సరైన సమయంలో సరైన వేతనాలు పెంచకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని, తాము మాత్రం ఉద్యోగులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోపోబోమని మరో ప్రముఖ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ స్పష్టం చేసింది.

దీనికి తోడు ఇటు కంపెనీలకే కాకుండా మూన్‌ లైటింగ్‌ వివాదం ఉద్యోగుల మెడకు కూడా చుట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక కంపెనీలో పూర్తిస్థాయి వేతనం తీసుకుంటూ మరో కంపెనీలో కాంట్రాక్టు పద్ధతిలో వేతనం తీసుకుంటుండడంతో ఉద్యోగులకు ట్యాక్స్‌ సమస్యలు వస్తున్నట్లు చెబుతున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో వేతనమిచ్చే రెండవ కంపెనీ ఉద్యోగులకు టీడీఎస్‌ పేరుతో పన్నులు విధిస్తున్నారని చెబుతున్నారు.

టెకీల కెరీర్‌పై ప్రభావం…

మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డ ఉద్యోగులను కొన్ని కంపెనీలు ప్రస్తుతానికి సమర్థించినప్పటికీ తర్వాత ఆ కంపెనీలు ఉద్యోగులపై చర్యలు తీసుకోవని గ్యారంటీ ఏమీ లేదని పలు ప్రముఖ హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. కంపెనీలకు డీల్స్‌ ఎక్కువగా ఉండి డిమాండ్‌ ఎక్కువగా ఉన్నంత కాలం యాజమాన్యాలు మూన్‌లైటింగ్‌ ఉద్యోగుల జోలికి వెళ్లవని, అయితే మాంద్యం పరిస్థితులు ముదిరి కంపెనీలకు డీల్స్‌ తగ్గితే మాత్రం తొలుత వారే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కన్సల్టెన్సీలు హెచ్చరిస్తున్నాయి. కొవిడ్‌ తర్వాతి పరిణామాల్లో ఐటీ కంపెనీలకు విపరీతంగా ప్రాజెక్టులు వచ్చిపడడంతో అవి కొత్తవారిని భారీగా నియమించుకున్నాయి. వీరు శిక్షణ పూర్తిచేసుకుని పూర్తిస్థాయిలో సిద్ధమైతే భారీ వేతన ప్యాకేజీలు తీసుకుంటున్న సీనియర్లు ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement