దావోస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్పర్యటనలో మరో కీలక అడుగు ముందుకు పడింది. హైదరాబాద్‌లో విప్రో సంస్థ విస్తరణకు అంగీకారం కుదిరింది.. గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో 5 వేల మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశముంది.
దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సమావేశం అయ్యారు. భేటీ అనంతరం విప్రో విస్తరణపై కీలక ప్రకటన విడుదల చేశారు. రాబోయే రెండు మూడేండ్లలో కొత్త ఐటీ సెంటర్ పూర్తి కానుంది. విప్రో విస్తరణ ప్రణాళికను సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఇప్పటికే దావోస్ పర్యటనలో 70 వేల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తెలంగాణాకు పెట్టుబడుల ఒప్పందాలపై ప్రభుత్వ వర్గాల హర్షం వ్యక్తం చేస్తున్నాయి.కాగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై తెలంగాణ కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా.. ఒకేరోజు రూ.56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో ముఖ్యమైనది.. ఇంధన రంగంలో దేశంలోనే పేరొందిన సన్ పెట్రో కెమికల్స్ సంస్థ రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ జలవిద్యుత్తు, సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటుకు చేసుకున్న రూ.45,500 కోట్ల ఒప్పందం.