ఉత్తరప్రదేశ్‌లో కొద్దిరోజుల క్రితం ఓ మహిళ తన భర్తను బతికించుకునేందుకు నోటితో శ్వాస అందించింది భార్య. అలా చేసి ప్రాణాలు బతికించుకునేందుకు ఆ మహిళ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కొద్దిసేపటికే సదరు వ్యక్తి మృతిచెందాడు. కాగా అదే తరహా ఘటన ఉత్తరప్రదేశ్‌లోనే చోటుచేసుకుంది. కుమార్తె నోటి ద్వారానే ఊపిరి అందించి తల్లి ప్రాణాలు కాపాడుకుంది.
కరోనా సోకడంతో ఓ మహిళకు చికిత్స అందించేందుకు బహ్రాయిచ్‌లోని మహారాజ్ సుహేల్దేవ్ వైద్య కళాశాలకు తరలించారు. అయితే, అక్కడ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు కూడా ప్రాణవాయువు అందటం లేదు. సదరు మహిళ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్ కోసం సంప్రదించినా.. కొరత కారణంగా వారికి లభించలేదు. దాంతో అక్కడే ఉన్న కుమార్తె తన నోటితో తల్లికి ఊపిరి అందించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం స్థిమితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరో నర్సింగ్ హోంలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.