హైదరాబాద్,ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నవంబర్‌లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. డీఎస్సీ పరీక్షలు జరుగుతాయా? లేదా అన్న సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి. సోమవారం నాడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఎట్టకేలకు ప్రకటించడంతో అది నిరుద్యోగ అభ్యర్థులకు శాపంగా మారనుందనే చర్చ జరుగుతోంది.
నవంబరు 30న రాష్ట్రంలో అసెంబ్లి స్థానాలకు ఎన్నికలు జరుగనుండటంతో డీఎస్సీ అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తుంది. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే విద్యాశాఖ వెల్లడించింది. డీఎస్సీ పరీక్షల నిర్వహణపై అధికారులు స్పష్టత ఇవ్వవలసి ఉంది. ఏరకంగా చూసిన డీఎస్సీ పరీక్షలు వాయిదాపడే అవకాశముందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల కానుంది.
ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కూడా అదే రోజు నుంచి ప్రారంభమై నవంబర్ 10 వరకు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువిచ్చారు. ఇక పోలింగ్ నవంబర్ 30వ తేదీన నిర్వహించనున్నారు. ఇక డీఎస్సీ పరీక్షలు నవంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు.
నవంబర్ 22న స్కూల్ అసిస్టెంట్ లాంగ్వెజ్ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. నవంబరు 23న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల అభ్యర్థులకు నిర్వహిస్తారు. వీరందరికీ మొదటి విడతలోనే పరీక్షలు నిర్వహించి పూర్తి చేయనున్నారు. నవంబరు 24న లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబరు 25 నుండి 30 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పరీక్షలు జరుగనున్నాయి.
వీటిని కూడా ప్రతీ రోజూ రెండు విడతల్లో నిర్వహించనున్నారు. అయితే వివిధ శాఖల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల డ్యూటీలు, డీఎస్సీ పరీక్ష డ్యూటీలు పడనున్నాయి. ఈ క్రమంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించడం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 8న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
దీనిద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ.. సెప్టెంబరు 20న అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రతీ రోజూ రెండు విడతల్లో ఉదయం 9 గంటల నుండి 11.30 వరకు మొదటి విడత, రెండో విడతలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.
అయితే దరఖాస్తులు మాత్రం అంతంతమాత్రంగానే వస్తున్నాయి. మొత్తం ఖాళీల్లో ఎస్జీటీ పోస్టులు 2,575, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1,739, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 611, పీఈటీ- 164 పోస్టులు ఉన్నాయి. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 358, నిజామాబాద్ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43 ఖాళీలున్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు ప్రకటించిన 5వేల పోస్టులకు మరిన్ని పోస్టులను కలిపి 13 వేల పోస్టులతో మెగా డీఎస్సీని వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు డీఎస్సీని వాయిదా వేయాలని కోరుతున్నారు. దీనికి తోడూ ఎన్నికలు కూడా ఉండడంతో డీఎస్సీ పరీక్షలు అనుకున్న షెడ్యూల్‌కు జరుగుతాయా? లేదా? అన్న సందేహాలు అభ్యర్థుల్లో నెలకొన్నాయి.